Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: తెలంగాణలో వంద హాట్ స్పాట్స్, ఈ ప్రాంతాల్లోనే...

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా వంద హాట్ స్పాట్స్ ను గుర్తించినట్లు సమాచారం. హైదరాబాదులోనే కాకుండా జిల్లాల్లో కూడా కరోనా విస్తరిస్తున్న స్థితిలో ఈ చర్యలు చేట్టింది.

Telangana marks 100 hotspots to check virus spread
Author
Hyderabad, First Published Apr 8, 2020, 8:34 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోనే కాకుండా జిల్లాల్లో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది. వివిధ జిల్లాల్లో దాదాపు 100 ప్రాంతాలను హాట్ స్పాట్ గా ప్రకటించాలని యోచిస్తోంది. హాట్ స్పాట్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజల కదలికలపై మరిన్ని ఆంక్షలు అమలవుతాయి. 

హాట్ స్పాట్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలను 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత కూడా బయటకు రానివ్వరు. కూరగాయలు, మందుల వంటి నిత్యావసర సరుకులను ఇళ్లకే సరఫరా చేస్తారు. కరీంనగర్ లో ఇండోనేషియన్లు ఉన్న ప్రాంతాల్లో అనుసరించిన విధానాన్నే ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తారు. 

ఇండోనేషియన్ల ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించకుండా చూడడానికి వారు ఉన్న ప్రాంతంలో 3 కిలోమీటర్ల పరిధి మేర ఆంక్షలు విధించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, గద్వాల, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు కొత్తగా బయటపడుతున్నాయి. 

ఆదిలాబాద్ జిల్లాలోని 19 వార్డులను, నేరడిగొండలో ఐదు గ్రామాలను, ఉట్నూరు మండలంో మూడు గ్రామాలను హాట్ స్పాట్స్ గా గుర్తించారు. జిల్లాలో మొత్తం పది కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వాటిలో ఆరు ఆదిలాబాదు పట్టణంలో, నెరడిగొండలో మూడు, ఉట్నూరు మండలంలో ఒకటి కేసులు బయటపడ్డాయి. జిల్లా నుంచి 73 మంది జమాత్ లో పాల్గొని తిరిగి వచ్చారు. 

సూర్యాపేట జిల్లాలోని వర్ధమాను కోటలో ఆరు కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ గ్రామాన్ని సీల్ చేసారు. కరోనా పాజిటివ్ వ్యక్తి ఆ గ్రామంలోని కుటుంబాన్ని సందర్శించాడు. వర్దమానుకోట నుంచి ముగ్గురిని, మసిరెడ్డిపల్లి నుంచి ఏడుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

నిజామాబాద్ జిల్లాలో 15 ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా గుర్తించారు జిల్లాలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో మాలపల్లి, హిమాద్ పుర, హబీబ్ నగర్, ఖిల్లా రోడ్డు, బోధన్, భీమ్ గల్, ఆటోనగర్, మక్లూరు, నందిపేటలను హాట్ స్పాట్స్ గా గుర్తించారు. 

కామారెడ్డిలో ఐదు ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా గుర్తించారు. అవి టీచర్స్ కాలనీ, మదీనా కాలనీ, అరాఫత్ కాలని, ఈ కాలనీలకు సమీపంలో ఉన్న మరో ఐదు ప్రాంతాలు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు హాట్ స్పాట్స్ ను గుర్తించారు. కొత్తగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో ఆ చర్యలు తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios