ఇటలీ, అమెరికా పరిస్థితి రావొద్దంటే... లాక్ డౌన్ పొడిగిస్తే సహకరిద్దాం: హరీష్ రావు

ఇటలీ,అమెరికా లాంటి పరిస్థితి రావొద్దంటే ప్రజలు మరికొంత కాలం సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి హరీష్ రావు సిద్దిపేట వాసులకు సూచించారు. 

Minister Harish Rao Distributes essentials to  poor peoples

సిద్ధిపేట: మనిషి ప్రాణాలకంటే ముఖ్యమేది కాదని... సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దని... ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నదని, ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు.  పరిస్థితులు అనుకూలిస్తే సరే... లేదంటే లాక్ డౌన్ పొడగిస్తే సహకరిద్దామని సిద్ధిపేట ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్స్ లో మంగళవారం రాత్రి పట్టణంలోని లైట్ మోటారు వెహికిల్, మెకానిక్, మ్యాజిక్ ఆటో అసోసియేషన్లకు చెందిన 325 సంఘ సభ్యులకు బియ్యం, 8 రకాల నిత్యావసర సరుకుల వస్తువులు కలిగిన కిట్స్ ను ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం అందరి క్రమశిక్షణ, దేవుడి దయ వల్ల సిద్దిపేటలో ఒక కరోనా కేసు నమోదు కాలేదన్నారు. ఇటలీ, అమెరికా లాంటి దేశాలు కరోనా మహమ్మారికి వణికి పోతున్నాయని... అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు, సలహాలను పాటించని ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వానికి లాక్ డౌన్ వల్ల ఆదాయం నష్టం జరుగుతుందని తెలిసినా సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యం ముఖ్యమని తలిచారని, అందుకే లాక్ డౌన్ అమలుకు ప్రాధాన్యత ఉందన్నారు. ఈ సమయంలో పేదలు, వలస కార్మికులు, రోజూ రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి కార్మికుల గురించి ఆలోచించి తన ఉడుతా భక్తిగా ఈ సాయాన్ని చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏ అవసరమొచ్చినా తన దృష్టికి తేవాలని, కావాల్సిన సాయాన్ని శాయశక్తులా చేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  

 కరోనాను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని బాధ్యతగా పాటించాలని... అలా సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ఎవరి ఇంటిలో వారే ఉన్నట్లయితే   కుటుంబాన్ని, రాష్ట్రాన్ని,  దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని చెప్పారు. 

అంతకు ముందు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..  ఏ ఆపదోచ్చినా ఆదుకునేందుకు ముందుండే వ్యక్తి హరీశ్ రావు అని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ ఆలోచన చేసి ఉడుతా భక్తిగా సాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. కరోనా వ్యాధి ప్రభావంతో ప్రపంచమే వణుకుతున్నదని, సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమని, లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios