Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లాక్ డౌన్: హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు క్లోజ్

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డును మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ముందు జాగ్రత్తగా దాన్ని మూసేసింది.

Lock down: Hyderabad Outer Ring Road closed
Author
Hyderabad, First Published Mar 28, 2020, 1:16 PM IST

హైదరాబాద్: తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డును మూసేసింది. ట్రాఫిక్ లేకపోవడంతో అతి వేగంతో వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అవుటర్ రింగ్ రోడ్డును మూసేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్ ధ్రువీకరించారు. గత అర్థరాత్రి ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించి 6గురు సంభవించడంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను మాత్రం అనుమతిస్తారు. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు అవుటర్ రిం్గ్ రోడ్డుపై గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదు శివారులోని శంషాబాద్ సమీపంలో గల పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది.బొలేరో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన కూలీలు.

లాక్ డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో తమ స్వస్థలం రాయచూర్ వెళ్లేందుకు వారు వెళ్తున్నారు. సూర్యాపేట నుంచి వస్తున్న వారి బొలేరో వాహనాన్ని వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడు.ప్రమాదంలో బొలేరో డ్రైవర్ కూడా మరణించాడు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతుల్లో ఓ చిన్నారి, ఓ బాలిక ఉన్నారు. 

ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్ కు చెందిందిగా గుర్తించారు. ఇందులో కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడికాయలు తీసుకుని వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios