Asianet News TeluguAsianet News Telugu

కొత్తగా 30 కేసులు, ఆస్పత్రుల్లో 308 రోగులు: కేసీఆర్ వెల్లడి

తెలంగాణలో 308 మంది కరోనా వైరస్ రోగులు చికిత్స పొందుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మొత్తం 364 కేసులు రికార్డు కాగా, 45 మంది కోలుకున్నారని ఆయన చెప్పారు. మరణించిన 11 మంది మర్కజ్ వెళ్లివచ్చినవారని చెప్పారు.

KCR says 308 Coronavirus positive patients are getting treatment
Author
Hyderabad, First Published Apr 6, 2020, 7:51 PM IST

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాధి కట్టడిలో తాము గణనీయమైన విజయం సాధించినట్లేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ప్రస్తుతం 308 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో మొత్తం 364 మందికి కరోనా పాజిటివ్ రాగా, 45 మంది డిశ్చార్జి అయ్యారని ఆయన చెప్పారు. కొత్తగా మరో 60, 70 పాజిటివ్ కేసులు బయటపడవచ్చునని ఆయన అన్నారు. 

ప్రస్తుతం 600 మందికి పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మరో రెండు రోజుల్లో వారికి సంబంధించిన పరీక్షల నివేదికలు వస్తాయని ఆయన చెప్పారు. లాక్ డౌన్ వల్లనే కరోనా వ్యాధిని కట్టడి చేయగలిగామని ఆయన చెప్పారు. తొలి దశలో కరోనా వైరస్ సోకిన వారంతా క్షేమంగా బయటపడ్డారని ఆయన చెప్పారు. మర్కజ్ ఘటన దేశాన్ని అతలాకుతలం చేసిందని, మన రాష్ట్రానికి కూడా ఆ బెడద తప్పలేదని ఆయన చెప్పారు. 

నిజాముద్దీన్ సంఘటన అతలాకుతలం చేసింది. అన్ని రకాలవి కలిపి 364 మందికి మొత్తం సోకిందని ఆయన చెప్పారు. వారిలో పది మంది కరీంనగర్ టీమ్ అని, వారు క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆ పది మంది డిశ్చార్జీ అయ్యారని ఆనయ చెప్పారు.. మొదటి దశలో మొత్తం 25,937 మందిని క్వారంటైన్ చేశామని ఆయన చెప్పారు.  
మొదటి దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు వ్యాధి సోకినవారి సంఖ్య 50 ఉందని, వారిలో 30 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లు కాగా, మిగతావాళ్లు వారి కుటుంబ సభ్యులని ఆయన చెప్పారు. వారంతా క్షేమంగా బయటపడ్డారని, వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని ఆయన చెప్పారు. త్వరగా గుర్తించాం కాబట్టి కాపాడగలిగామని ఆయన చెప్పారు.   

ఆ 50 మందిలో 35 మందిని డిశ్చార్జీ చేశామని, మరో 15 మందిని ఎల్లుండిలోగా డిశ్చార్జీ చేస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీలోగా అందరూ డిశ్చార్జీ అవుతారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 11 మంది మరణించారని ఆయన చెప్పారు. వీరంతా రెండో దశకు చెందినవారని, వారు కూడా ఢిల్లీ మర్కజ్ నుంచి తిరిగి వచ్చినవాళ్లేనని ఆయన అన్నారు. 

మర్కజ్ నుంచి వచ్చిన 1089 మందిని గుర్తించామని,  మరో 30, 35 మంది ఢిల్లీలోనే ఉండిపోయినట్లు తెలుస్తోందని, వారిలో 175 మందిని క్వారంటైన్ చేశామని ఆయన చెప్పారు. వారితో సంబంధాల్లోకి వచ్చినవారిని కూడా గుర్తిస్తామని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios