రేషన్ కావాలంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే.. ఓమ్రికాన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికే రేషన్ ఇవ్వాలని భావిస్తోంది. పలు జిల్లాలో అమలు చేస్తోంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ చివరి వరకు తెలంగాణలో అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. రేషన్ సరుకులు తీసుకోవాలంటే వ్యాక్సిన్ తప్పకుండా వేయాలనే రూల్ అమలు చేయనుంది. ఇప్పటికే ఈ నిర్ణయం పలు జిల్లాలో అమలు చేస్తోంది.
కొత్త వేరియంట్ వార్తల నేపథ్యంలో..
కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడింది. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. కొందరు ఆత్మీయులను కోల్పోగా.. మరి కొందరు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికిపోయారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక స్థితి దిగజారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ పాత జీవితానికి అలవాటు పడుతున్నారు. అన్ని కుదురుకుంటున్న సమయంలో మళ్లీ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఓమ్రికాన్ వేరియంట్ వల్ల ప్రపంచ దేశాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి.
దక్షిణాఫ్రికాలో కేసులు బయటపడిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో, ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఇండియాలోకి ప్రవేశిస్తే దానిని ఎదుర్కొవానిడికి సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ అన్ని సిద్ధంగా ఉంచుకుంది. ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచడానికి వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి ఓమ్రికాన్ సోకినా.. అది తీవ్రతరం కాదని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది. ఈ డిసెంబర్ నాటికి టార్గెట్ పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటనే రేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. వ్యాక్సినేషన్ పట్ల అయిష్టత ఉన్న వారు కూడా ఈ నిర్ణయం వల్ల వ్యాక్సిన్ వేయించుకుంటారని భావిస్తోంది. ఈ నిర్ణయం ఇప్పటికే పలు జిల్లాలో అమలు చేస్తోంది.
https://telugu.asianetnews.com/telangana/213-new-corona-cases-reported-in-telangana-r3ln2r
వ్యాక్సినేషన్‌లో రేషన్ డీలర్ల భాగస్వామ్యం..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం రేషన్ డీలర్లను కూడా భాగస్వామ్యం చేసింది. తమ పరిధిలో ఉండే రేషన్ లబ్దిదారులతో డీలర్లకు కొంత పరిచయాలు ఉండటం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ సులభం అవుతుందని భావిస్తోంది. గ్రామాల్లో తిరుగుతూ వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి వివరాలు సేకరించాలని చెప్తోంది. మొదటి డోస్ తీసుకొని కాలపరిమితి ముగిసినా రెండో డోస్ వేసుకోని వారిని గుర్తించి, వారిని రెండో డోసు వేయించుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తోంది. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకున్న వారి సర్టిఫికెట్లలో ఉండే బెన్‌ఫిషరీ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు సేకరించాలని ఆదేశించింది. గ్రామాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రేషన్ డీలర్ల సర్వేను మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
స్పెషల్ కాల్ సెంటర్ల ఏర్పాటు..
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వో ఆఫీసులో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి వివరాలు వారికి అందుబాటులో ఉంచింది. మొదటి డోస్ తీసుకొని, రెండో డోసు వేసుకొని వారికి కాల్ చేస్తున్నారు. రెండో డోసు వేసుకోవాలని సూచిస్తున్నారు. అయిష్టత వ్యక్తం చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రొత్సహిస్తున్నారు. ఇది ఇప్పటికే అన్ని జిల్లాల్లో అమలవుతోంది.