Asianet News TeluguAsianet News Telugu

ఓమ్రికాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం- తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు

ఓమ్రికాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 

Government ready to face Omricon - Telangana Public Health Director Srinivas Rao
Author
Hyderabad, First Published Dec 5, 2021, 6:54 PM IST

క‌రోనా కొత్త వేరియంట్ ఓమ్రికాన్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు వెల్ల‌డించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్తలు పాటించ‌డం ద్వారా కొత్త వేరియంట్ కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు. క‌రోనా డెల్టా వేరియంట్ కంటే ఓమ్రికాన్ ఆరు రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో వైర‌స్ తీవ్ర‌త ఏలా ఉందో తెలిసేందుకు ఇంకా వారం రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరిగిన‌ప్పటికీ హ‌స్పిట‌ల్స్‌లో చేరిక‌లు, మ‌ర‌ణాలు పెర‌గ‌డం లేద‌ని తెలిపారు. విదేశాల నుంచి తెలంగాణకు వ‌చ్చే వారికి పూర్తి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామని తెలిపారు. విదేశీ ప్ర‌యాణీకులంద‌రికీ శంషాబాద్ విమానాశ్ర‌యంలోనే టెస్ట్‌లు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఓమ్రికాన్ ప్ర‌భావిత దేశాల నుంచి 979 మంది ప్ర‌యాణీకుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఇందులో 13 మందికి పాజిటివ్ ఉన్న‌ట్టుగా గుర్తించామ‌ని చెప్పారు. వారినంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌ని తెలిపారు. వారికి సోకింది ఓమ్రికాన్ వైర‌స్ సోకిందో లేదా డెల్టా వేరియంట్ సోకిందో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ప‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. 

https://telugu.asianetnews.com/telangana/213-new-corona-cases-reported-in-telangana-r3ln2r

92 శాతం మందికి మొద‌టి డోసు కంప్లీట్‌..
తెలంగాణ‌లో జ‌నాభాలో 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ 2 కోట్ల 76 ల‌క్ష‌ల 66 వేల డోసులు అవ‌స‌రమ‌ని ప్ర‌భుత్వం గుర్తించింద‌ని తెలిపారు. వీరిలో  ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల 54 ల‌క్ష‌ల 39 వేల కోట్ల డోసులు మొద‌టి డోసుగా ఇచ్చామ‌ని తెలిపారు. అంటే తెలంగాణ జ‌నాభాలో 92 శాతం ప్ర‌జ‌లు మొద‌టి డోసు తీసుకున్నార‌ని చెప్పారు. 1 కోటి 33 ల‌క్ష‌ల 71 వేల ప్ర‌జ‌లు రెండో డోసు కూడా ఇప్ప‌టికే వేసుకున్నార‌ని ప్ర‌క‌టించారు. అంటే సుమారు 48 శాతం కంటే ఎక్కువ ప్ర‌జ‌లు రెండో డోసు పూర్తి చేసుకున్నార‌ని చెప్పారు. ఇంకా మొద‌టి డోసు తీసుకునే వారు 23 లక్ష‌ల 27 వేల మంది ఉన్నార‌ని తెలిపారు. వారికి ఈ నెల‌ఖారులోగా మొద‌టి డోసు వ్యాక్సిన్ వేస్తామ‌ని చెప్పారు. దీంతో 100 శాతం మందికి మొద‌టి డోసు విజ‌యవంతంగా పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంద‌ని అన్నారు. అలాగే 79 ల‌క్ష‌ల 88 వేల మంది ఈ డిసెంబ‌ర్ నెల‌లో రెండో డోసు తీసుకోవాల్సిన వారు ఉన్నార‌ని తెలిపారు. రెండు డోసుల‌కు క‌లిసి ఈ డిసెంబ‌ర్ నెల‌లో 1 కోటి 3 ల‌క్ష‌ల 16 వేలు డోసులు ఇవ్వాల్సి ఉంద‌ని అన్నారు. ఈ టార్గెట్ పూర్తి చూస్తే రెండో డోసు కూడా 65-75 శాతం పూర్తి చేసినట్టు అవుతుంద‌ని తెలిపారు. ఇలా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో హెర్ధ్ ఇమ్యూనిటీ, హైబ్రిడ్ ఇమ్యూనిటీ రావ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు కొత్త వేరియంట్ నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చని తెలిపారు. తెలంగాణ స‌మాజం కొత్త వేరియంట్ ప్ర‌భావానికి గురి కాకుండా ఉంటుంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకోని వారు ద‌గ్గ‌ర‌లోని వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ కు వెళ్లి, లేదా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటి దగ్గ‌రికి వ‌చ్చిన‌ప్పుడు వారి వ‌ద్ద పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు.

జ‌న‌వ‌రి 15 నుంచి కేసులు పెరిగే అవకాశం
ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న సమాచారం ప్ర‌కారం దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌వరి 15 నుంచి కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఫిబ్ర‌వ‌రీ నెల‌లో కొంచెం ఉదృతికి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు ఓమ్రికాన్‌ను శ‌రీరంలోకి రాకుండా కాపాడుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఒక వేళ క‌రోనా సోకిన చాలా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలతో బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని తెలిపారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకొని లాభం లేదు కావున ప్ర‌జ‌లు ముందే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. రాబోయే ఆరు వారాల పాటు ప్ర‌జ‌లు ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు స్వీయ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. ఈ ఓమ్రికాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టం వ‌ల్ల ఇంట్లో ఒక్క‌రికి సోకినా కుటుంబం మొత్తం ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఈ వైర‌స్ చిన్న పిల్ల‌ల‌పై కూడా దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. మొద‌టి వేవ్‌, రెండో వేవ్ ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంద‌ని అన్నారు. ఓమ్రికాన్ వేరియంట్ ను కూడా ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios