హైదరాబాద్: ప్రేమించి యువతిని పెళ్లి చేసుకొన్నాడు.  పెళ్లైన తర్వాత మరో యువతితో ప్రేమ వ్యవహరం నడిపాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో పాటు ప్రియురాలి నుండి  ఒత్తిడి పెరగడంతో  ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ లోని రెయిన్ బజార్ కు చెందిన  జమాల్పుర్ కరణ్ లాల్   మాంసం విక్రయదారుడు.  ఆయన తనయుడు  దీపక్ కుమార్. తండ్రికి ఈ వ్యాపారంలో దీపక్ చేదోడు వాదోడుగా ఉండేవాడు.గత ఏడాది హయత్‌నగర్ కు చెందిన  యువతిని దీపక్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  భార్యతో కలిసి ఆయన హయత్‌నగర్ లోనే నివాసం ఉంటున్నాడు.  భార్యతో సంసారం కొనసాగిస్తూనే మరో అమ్మాయితో  ప్రేమాయణం ప్రారంభించాడు. ప్రియురాలి విషయం భార్యకు తెలిసింది.  దీంతో ఆమె భర్తను నిలదీసింది.  ప్రియురాలి నుండి  ఒత్తిడి పెరిగింది. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పుకొని బాధపడేవాడు.

దీంతో ఆత్మహత్య చేసుకోవాలని దీపక్ నిర్ణయం తీసుకొన్నాడు. శనివారం నాడు తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా చెప్పాడు.  సైదాబాద్ కు సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.  కొడుకు ఫోన్  కట్ చేయగానే తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు.  ఈ సమాచారం అందుకొన్న పోలీసులు దీపక్ కుమార్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎర్రకుంట చెరువు సమీపంలోని పాడుబడిన బావి వద్దకు వెళ్లారు. అప్పటికే దీపక్ మృతదేహం బావిలో తేలింది.  పోలీసులు మృతదేహన్ని బావిలో నుండి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.