బీఆర్కె భవన్ లో కరోనా కలకలం: సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్
హైదరాబాదులోని బీఆర్కె భవన్ లో కరోనా కలకలం చెలరేగింది. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
హైదరాబాద్: తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కె భవన్ లో కరోనా కలకలం చోటు చేసుకుంది. సచివాలయంలో పనిచేస్తున్న ఎఎస్ఓకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అతను ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. ఆ విషయాన్ని అతను గోప్యంగా ఉంచాడు. పలువురు ఐఎఎస్ అధికారులతో కూడా అతను కలిసి తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం బీఆర్కె భవన్ ను ఖాళీ చేయించి, శానిటైజ్ చేయడం ప్రారంభించారు.
ఈ కేసుతో తెలంగాణలో ఇప్పటి వరకు 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఆరుగురిలో నలుగురు ఢిల్లీలోని ప్రార్థనా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చినవారే. ఇదిలా వుంటే, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని కరోనా నెగెటివ్ రావడంతో హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
తెలంగాణలో జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం తెలంగాణ ప్రభుత్వం జల్లెడ పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని చెక్ పోస్టు వద్ద లోనికి రావడానికి ప్రయత్నించిన 32 మందిని అడ్డుకున్నారు.
వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసేయడంతో పలువురు మతిస్థిమితం కోల్పోయి హైదరాబాదులోని మానసిక చికిత్సాలయానికి చేరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో మతిస్థిమితం కోల్పోయి ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.