హైదరాబాద్: కరోనా వైరస్... ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి కారణంగా పరీక్షల సమయంలోనూ విద్యార్థుల ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూళ్లకు సెలవులుండటం, యావత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పిల్లలంతా ఇళ్లవద్దే  వుండాల్సి వస్తోంది. ఇలా పరీక్షల సమయంలో తమ పిల్లలు ఇళ్లకే పరిమితమవడంతో కొందరు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటివారికి తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కనువిప్పు కల్పించి వుంటుందని చెప్పాలి. 

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా వుండే కేటీఆర్ ప్రజా సమస్యల గురించి స్పందించడమే కాదు అప్పుడప్పుడు  తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలా ప్రస్తుత లాక్ డౌన్  సమయంలో తన పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి అంటూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 

 ''ఈ విపత్కర సమయంలో నా కూతురు, కొడుకుకు ఆన్ లైన్ స్కూలింగ్ కొనసాగుతోంది. ఇంట్లోనే వుంటూ వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటున్నారు''  అంటూ  ల్యాప్ ట్యాప్ లో కూతురు, కొడుకు ఆన్ లైన్ క్లాసెస్ ను ఫాలో అవుతున్న ఫోటోను జతచేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికి కొందరు తమ పిల్లలను తీసుకుని బయటకు రావడం వంటివి చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇంట్లో వుండటంలో పిల్లలను బయటకు తీసుకువస్తున్నామని సమాధానం చెబుతున్నారు.  అలాంటివారికి కేటీఆర్ చేసిన ట్వీట్ చెంపదెబ్బ లాంటిది. 

విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు పుస్తకాలను మూలన పడేశారు. కానీ ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా కూడా పిల్లలు చదువుకోవచ్చని... ఈ సెలవుల సమయంలో అవెంతో ఉపయోగకరంగా వుంటాయని చాలామందికి తెలిసినా అలా చేయడం లేదు. కానీ కేటీఆర్ మాత్రం తన పిల్లలను ఇంట్లోనే వుంచి బుద్దిగా ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా  చదువుకునే ఏర్పాటు చేశారు. ఇలా ఈతరం  తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు.