కరీంనగర్: తెలంగాణలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కరీంనగర్ లో ఇద్దరు వ్యక్తులు ఐసోలేషన్ వార్డు నుండి తప్పించుకుని పరారవడం కలకలం సృష్టించింది. అయితే ఉదయం పరారైన వారిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకుని తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించినా టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. బయట వారు ఎవరెవరికి కలిశారు... ఎవరికైనా ఈ వైరస్ ను అంటించారా అన్న ఆందోళన అటు వైద్యుల్లోనూ ఇటు ప్రజల్లోనూ నెలకొంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో కరోనా అనమానితులను వుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో ఈ వార్డులో నుండి ఇద్దరు అనుమానితులు హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

 నుంచి పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎక్కడున్నా వెంటనే పట్టుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు  అప్రమత్తమై మద్యాహ్నం లోపే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సిబ్బందికి వారిద్దరిని అప్పగించగా తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే వారు బయటికి వెళ్లినప్పుడు ఎంతమందిని కలిశారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ఇక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వైద్యారోగ్య శాఖతో పాటు పోలీస్ శాఖ అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనిలో  కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా డ్యూటీలో ఉన్న పోలీసు మరియు మీడియా సిబ్బందికి మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.  దీనికి ముఖ్య అతిథులు  రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ  హాజరయ్యారు. 

 ఈ  సందర్బంగా సీపీ గారు  మాట్లాడుతూ....లాక్ డౌన్ సందర్బంగా  కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పోలీస్ శాఖ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒకరు సోషల్ డిస్టెన్స్, వ్యక్తి గత భద్రత పాటిస్తూ అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతర సమయాల్లో బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండాలన్నారు. అలా ఉంటే వైరస్ వ్యాప్తి అనేది జరగదన్నారు. 

ఈ కార్యక్రమంలో సీపీతో పాటు పెద్దపల్లి డీసీపీ రవీందర్, అడిషనల్ డీసీపీ లా &ఆర్డర్ రవి కుమార్, ఏసీపీ ఉమేందర్, ఏసీపీ ట్రాఫిక్ రాంరెడ్డి, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు,  సీఐ గోదావరిఖని 1టౌన్ రమేష్, సీఐ ట్రాఫిక్ రమేష్ బాబు, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, ఎస్ఐ లు కమలాకర్, సూర్యనారాయణ, నాగరాజ్ ఆర్ఎస్ఐ సంతోష్,  ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.