Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బ్రేకింగ్: కరోనాతో తెలంగాణలో ఆరుగురు మృతి!

 తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్టు తెలిపింది.  మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారని నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది

Coronavirus Death Toll: Six people succumbed to this deadly virus in Telangana in a single day
Author
Hyderabad, First Published Mar 31, 2020, 6:26 AM IST

కరోనా వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచంతోపాటు భారతదేశం కూడా వణికిపోతుంది. కాకపోతే ఒకింత ముందుగానే తేరుకోబట్టి వ్యాప్తి మాత్రం కంట్రోల్ లో ఉంది. మన తెలంగాణలో పరిస్థితి మాత్రం ఒకింత అదుపులో ఉందనే చెప్పవచ్చు. కాకపోతే నిన్న ఒక్కరోజే ఆరుగురు కరోనా తో మరణించడం, అందరూ కూడా వేర్వేరు ఊర్లకు చెందిన వారవడం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. 

 తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్టు తెలిపింది. మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారని నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలిపింది. 

వీరి ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయని, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని, కాబట్టి వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని కోరింది. 

ఈ నిజాముద్దీన్ ప్రార్థనలు జరిగేనాటికి దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు లేవు. కాకపోతే అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్న చాలామందికి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దేశమంతా కూడా ఇదే విషయమై రచ్చ నడుస్తోంది. 

మొన్న తెలంగాణలో సంభవించిన ఒక మరణం, ఎవరైతే ఒక వ్యక్తిని అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యులు అప్పటికే అతడు మరణించాడని ధృవీకరించారో , అతడు కూడా నిజాముద్దీన్ లో జరిగిన ప్రార్థనలు అటెండ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి నిజానిజాలు తేలాల్సి ఉంది. 

ఇకపోతే... కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ మధ్య ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు అశ్రయం ఇచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కరీంనగర్ బాధితుడి సోదరికి, తల్లికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. బాధితుడి కుటుంబంలో మొత్తం ఏడుగురు సభ్యులున్నారు. అయితే, మిగతావారికి ఎవరికి కూడా కరోనా సోకలేదని సమాచారం. ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ధ్రువీకరించారు. 

బాధితుడి కుటుంబ సభ్యులను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రావద్దని ఆయన ఆదేశించారు. 622 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని శశాంక తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్ లో 35 మంది, చల్మెడ ఆసుపత్రిలో 49 మంది ఉన్నారని చెప్పారు. .

మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ లో ఉన్నారని అన్నారు. జిల్లాలో 14995 మంది వలస కూలీలు ఉన్నారని అన్నారు. వలస కూలీలకు ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు, 12 కిలోల బియ్యం రేపు సాయంత్రం లోగా పంపిణీ చేస్తామని అన్నారు.

కరీంనగర్ లోని ముకురంపురా ప్రాంతంలో మరోసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్తారని శశాంక చెప్పారు. మురంపుర ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కి హెల్త్  స్క్రీనింగ్ చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి దాకా కరీంనగర్ జిలాల్లో మొత్తం  105 శాంపుల్స్ టెస్ట్ చేశామని, రాష్ట్రంలోనే ఇంతగా టెస్ట్ శాంపుల్స్ చేసిన ప్రాంతం కరీంనగర్ మాత్రమేనని ఆయన అన్నారు. 

తాజా కేసులతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరుకుంది. కరోనా వైరస్ సోకి ఓ వృద్ధుడు హైదరాబాదులో మరణించిన విషయం తెలిసిందే. ఇండోనేషియా నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వచ్చినవారి వల్ల కరీంనగర్ ప్రమాదంలో పడింది. అక్కడి నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలగా, వారికి ఆశ్రయం కల్పించిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios