కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదని పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ కారణంగా అందరి బాధ ఒకటైతే మందు బాబుల పరిస్ధితి మరోకటి. ఎక్కడా మందు దొరక్కపోవడంతో చుక్క కోసం వారు గిలగిలా గింజుకుంటున్నారు. మద్యం దొరక్క నీళ్లలో స్పిరిట్ కలుపుకుని తాగే వాళ్లు కొందరైతే, షేవింగ్ లోషన్లను కూల్‌డ్రింక్‌లలో కలుపుకుని తాగేవాళ్లు మరికొందరు.

Also Read:పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఎమ్మెల్సీ ఫైర్

మందు దొరకని వారికి మతిలేని చేష్టలు కాస్తా మరణం అంచులదాకా తీసుకెళ్తున్నాయి. మొన్న శనివారం సేవింగ్ లోషన్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగిన ఇద్దరు మరణించారు. ఇంకా పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలో మద్యం షాపుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొందరు సైబర్ కేటుగాళ్లు గాలం వేసి నిలువునా ముంచారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కోఠి ప్రాంతంలో ఉన్న బగ్గా వైన్స్‌ పేరుతో క్యూఆర్ కోడ్ పంపించి దానికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే అరగంటలో మద్యం హోమ్ డెలీవరి చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు.

అసలే మందు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న మందు బాబులు ఈ ప్రకటన నిజమే అనుకుని అలాగే చేశారు. నగరంలోని గౌలిపురాకు చెందిన రాహుల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో వారికి రూ.51 వేలు పంపించాడు.

Also Read:కరోనా: ఢిల్లీ వెళ్లిన విషయం దాచిన రిమ్స్ డాక్టర్, చర్యలకు సిఫారసు

మద్యం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆ వ్యక్తికి.. ఎంతకీ లిక్కర్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సైబర్ కేటుగాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారంపై బగ్గా వైన్స్ యాజమాన్యం ఐదు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.