జనం చస్తుంటే ఆ వేషాలేమిటి: సీనితారలపై సానీయా మీర్జా ఫైర్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సెలిబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో వంటావార్పుల వీడియోలను షేర్ చేయడమేమిటని సానియా ప్రశ్నించారు.
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి చేందుతున్న నేపథ్యంలో సెలిబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై హైదరాబాదీ స్టార్ షట్లర్ సానియా మీర్జా మండిపడ్డారు. కోరనా వైరస్ తో జనం చస్తుంటే, చాలా మంది ఆకలితో అలమటిస్తుంటే సెలిబ్రిటీలు వంటావార్పుల వీడియోలతో లాక్ డౌన్ పాటిస్తున్నట్లు షేర్ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ట్విట్టర్ వేదికగా తన మనోభావాలను పంచుకున్నారు.
మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్ పూర్తయిందా, లేదా అని అడిగారు. ఒక్కసారి ఆలోచించండి. మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేల మంది మృత్యువాత పడుతున్నారని, లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారని ఆమె అన్నారు. ఇలాంటి సంక్షోభంలో అలాంటి వీడియోలు షేర్ చేయడమేమిటని ఆమె అడిగారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. రాష్ట్రంలో శనివారంనాడు 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 272కి చేరింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య 33కు చేరుకుంది.
తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 11 మంది మరణించారు. నిజామాబాద్ లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మరణించారు. దీంతో ఆ వ్యక్తి శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు. శనివారంనాడు అత్యధికంగా హైదరాబాదులోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులు ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు కావడం గమనార్హం.
హైదరాబాదు జిల్లాలో 22 మంది, మేడ్చల్ జిల్లాలో ఇద్దరు కరోనా వైరస్ పాజిటివ్ తో బాధపడుతున్నారు. హైదరాబాదు నారాయణగుడాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 48 మంది అతడి సన్నిహితులను, కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించారు. దిల్ సుఖ్ నగర్ లో ఒక్కరికి, మచ్చబొల్లారం, హఫీజ్ పేటల్లో ఇద్దరికి, మియాపూర్ లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
ఆదిలాబాద్ జిల్లాలో శనివారంనాడు తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. జిల్లా నుంచి మర్కజ్ కు వెళ్లిన 70 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్ కు పంపించారు. వారందరి నమూనాలను పరీక్షలకు పంపించగా, ఉట్నూరుకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
నల్లగొండ జిల్లాలో తాజాగా మరో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. జగిత్యాల జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వికారాబాద్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ధ్రువీకరించారు.