జహీరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటంలో వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు స్వచ్చందంగా ముందుకొచ్చి భారీ సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు దీనిపై పోరాడుతుంటే సాధారణ పౌరులు కూడా ముందుకొస్తున్నారు. ఇలా తాను పుట్టిపెరిగిన ప్రాంతం కోసం ఓ యువరైతు తాను సైతం అంటూ ముందుకొచ్చాడు. కరోనాపై  పోరాడేందుకు ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకుని తాను నిజమైన అన్నదాత అని నిరూపించుకుంటున్నాడు. 

దండిగె నాగేష్... జహిరాబాద్ ప్రాంతంలోని  ఓ మారుమూల గ్రామానికి చెందిన యువరైతు. వ్యవసాయం మాత్రమే  తెలిసిన ఆ రైతన్న తనకు ప్రజల ఆకలిబాధలు కూడా తెలుసని బయటపెట్టాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యావత్ దేశ లాక్ డౌన్ అవడంతో నిరుపేదలు, వలస కూలీల తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇది చూసి చలించిన ఈ యువరైతు తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చాడు.   

ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటను సైతం నిరుపేదలు, వృద్దుల ఆకలిబాధను తీర్చడానికి ఉపయోగిస్తున్నాడు. తన పొలంలో పండిన కూరగాయలను ఈ ఆపత్కాలంలో మండల ప్రజలను పంచిపెట్టడానికి ముందుకొచ్చాడు. కరోనా కారణంగా పనులు కోల్పోయిన వలస కూలీలకు, నిరుపేదలకు ఎకరం పొలంలో పండించిన పంటను సైతం పంచిపెడుతున్నాడు. ఇలా తనకు తోచిన సాయం చేస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. 

ఝరాసంఘం మండలపరిధిలోని ఎల్గోయి గ్రామానికి చెందిన నాగేష్ అతి చిన్న వయసులో రైతుగా మారాడు. తన సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా యావత్ దేశం ఆపదలోకి జారడం, ఈ సమస్యను ఎదుర్కోవడం కోసం కష్టపడుతున్న ప్రభుత్వాలకు ఆర్థికసాయం చేయడం చూసి  తానుకూడా ఏదయినా చేస్తే బావుంటుందని భావించాడు. 

అనుకున్నదే తడవుగా తన పొలంలో  పండించిన కూరగాయాల పంచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇలా సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచాడు. తనలాగే ప్రతి అన్నదాత నిరేపేదల ఆకలిబాధను తీర్చడానికి  ముందుకురావాలని ఈ  యువరైతు పిలుపునిచ్చాడు.