9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దు: మోడీపై ఓవైసీ ఫైర్
ఈ నెల 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలు ఆర్పేసి, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుద్దీపాలు కట్టేసి, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి ఇచ్చిన పిలుపుపై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తమ జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించవద్దని ఆయన కోరారు
దేశ ప్రజలకు ఆశలు, ఆకాంక్షలు ఉంటాయని ఆయన అన్నారు. దేశం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదని ఆయన అన్నారు. డ్రామాలు కట్టి పెట్టాలని ఆయన మోడీకి సూచించారు. దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇళ్లకు వెళ్లడానికి ఆరాటపడుతున్నారని ఆయన చెప్పారు.
కేంద్రం రాష్ట్రానికి ఏం ఇస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. వారికి ఏ విధమైన సహాయం చేస్తారో చెప్పాలని ఆయన అన్నారు. వాళ్లందరికీ కొవ్వొత్తులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.
ఏ రాష్ట్రానికి ఎంత సాయం చేశారో చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు. మీ డ్రామాలు కట్టిపెట్టాలని ఆయన మోడీని ఉద్దేశించి అన్నారు. పేదలను మోసం చేయవద్దని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పోస్టు చేశారు.
ఇళ్లలో ఉన్నవారెవరు కూడా ఒంటరి కారని, వారి వెంట 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారని నరేంద్ర మోడీ అన్నారు. ఎవరూ ఒంటరిగా యుద్ధం చేయడంలేదని, 130 కోట్ల మంది ప్రజలతో కలిసి ఐక్య పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. 130 కోట్ల ప్రజల సామూహిక శక్తి అర్థమయ్యే విధంగా ఆదివారం రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించాలని ఆయన కోరారు.