హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన 100 నెంబర్ కు అనవసర ఫోన్ కాల్స్ వస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుండి ఇప్పటివరకు  12 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి.

కరోనాను పురస్కరించుకొని లాక్ డౌన్ విధించడంతో అత్యవసర అవసరాల కోసం 100 నెంబర్  కు ఫోన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

లాక్ డౌన్ ప్రారంభమైన రోజున 100 నెంబర్ కు 1.40 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి.  కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టుగా 2418 ఫోన్ కాల్స్  వచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. మరో వైపు అత్యవసర అవసరాల కోసం 53,581 ఫోన్లు వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన 12 లక్షల ఫోన్ కాల్స్ లో అవసరమైన ఫోన్ కాల్స్ కేవలం 78,039 మాత్రమే ఉన్నాయని కాల్ సెంటర్ అధికారులు తెలిపారు.

Also read:ఢిల్లీ నుండి నేరుగా హైద్రాబాద్‌కు: ఆరుగురు మలేషియన్ల అరెస్ట్

అవసరం లేకున్నా 100 నెంబర్ కు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని కాల్ సెంటర్ అధికారులు చెబుతున్నారు. అనవసరమైన ఫోన్ కాల్స్ వల్ల నిజమైన అవసరం  ఉన్న వారికి కూడ సహాయం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి రోజూ కనీసం పది వేల నుండి 12 వేల ఫోన్ కాల్స్ వస్తున్నట్టుగా  అధికారులు చెబుతున్నారు. తప్పుడు ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం వల్ల కనీసం 30 నుండి 40 సెకండ్లు వృధా అవుతోంది. దీని వల్ల ఇతరులు ఈ నెంబర్ కు ట్రై చేసే సమయంలో  ఫోన్ ఎంగేజ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి సెకండ్ కూడ విలువైందని అధికారులు తెలిపారు. నెంబర్ 100 కు నిజమైన అవసరం ఉన్న వారే  ఫోన్ చేయాలని అధికారులు కోరారు.