తెలంగాణలో కరోనా: 11 మందికి కరోనా నెగిటివ్ ప్రకటించిన కేటీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకొన్నారు
హైదరాబాద్:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకొన్నారు. గతంలో పాజటివ్ లక్షణాలు కలిగిన వారికి తాజా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య 67కు చేరుకొంది. అయితే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిలో 11 మంది కోలుకొంటున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈ మేరకు ఆదివారం నాడు కరోనా తాజా పరీక్షల నివేదికలను కేటీఆర్ ట్వీట్ చేశారు.
also read:మాంఛెస్టర్‌లో చిక్కుకొన్న వరంగల్ వాసులు: కాపాడాలని కేటీఆర్‌కు వీడియో ట్వీట్
కింగ్ కోఠి ఆసుపత్రిలో 350 పడకలను కరోనా వ్యాధిగ్రస్తులకు కేటాయించామని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన వివరించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 987కు చేరుకొంది.
జీహెచ్ఎంసీ ద్వారా 150 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ఉచితంగా మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఉచితంగా సరఫరా చేస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.శనివారం నాడు 30 వేల మందికి ఉచితంగా హైద్రాబాద్ వాసులకు భోజనం సరఫరా చేసినట్టుగా ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీకి సహకరించిన అక్షయపాత్ర పౌండేషన్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అన్నపూర్ణ సెంటర్ల ద్వారా భోజనం సమకూర్చిన ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు.
హైద్రాబాద్ నగర వాసులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా 145 మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొబైల్ రైతు బజార్ల వద్ద కూరగాయల కొనుగోలు కోసం బారులు తీరిన ప్రజల ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు.