ముంబై: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చివరకు దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసే రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)నీ భయపెడుతోంది. ఈ మహమ్మారితో కమ్ముకొస్తున్న ఆర్థిక మాంద్యం మనల్ని వదలడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు.

ప్రపంచానికి పెను విపత్తుగా మారిన ‘కొవిడ్-19’ ఒక అద్ర్రుశ్య హంతకి’ ని అభిప్రాయపడ్డారు. మనుషుల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిదిమేయకముందే దీన్ని పూర్తిగా అంతమొందించాలని పిలుపునిచ్చారు. 

గత నెల 27వ తేదీన ముగిసిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం భారత ఆర్థిక వ్యవస్థపైనా ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం తప్పకుండా ఉంటుందని శక్తికాంత దాస్ కుండబద్దలు కొట్టినట్టు సోమవారం మీడియాకు చెప్పారు. 

కరోనా నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం కట్టుతప్పకుండా కాపాడుకోవడంతో పాటు డిమాండ్‌ మరింత క్షీణించకుండా రక్షించుకోవడమే ద్రవ్య, పరపతి విధానం ప్రధాన లక్ష్యం కావాలని శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. దీనికి తోడు ప్రతికూల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయక తప్పదన్నారు. 

also read  రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా పిడుగు...అక్షరాలా ఎంత నష్టమో తెలుసా ?

ఆర్థిక స్థిరత్వం కాపాడుతూనే వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు ఆర్బీఐ తీసుకుంటుందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. కరోనాతో తలెత్తిన ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు అప్పటికే వివిధ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు తీసుకున్న చర్యలనూ ఆయన వివరించారు. 

మార్చి 27న ముగిసిన ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటు ముప్పావు శాతం తగ్గించి 5.15% నుంచి 4.40 శాతానికి కుదించింది. దీనికి తోడు నగదు నిల్వల నిష్పత్తిని 4% నుంచి 3 శాతానికి కుదించి దాదాపు రూ.1.34 లక్షల కోట్ల అదనపు నిధులను అందుబాటులోకి తెచ్చింది. 

ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ద్రవ్యం అందుబాటులో ఉంచడం కీలకం అని శక్తికాంత దాస్ అభిప్రాయ పడ్డారు. ‘ఇప్పుడు మనం అత్యంత సంక్లిష్ట కాలంలో జీవిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదుర్కొనలేదు. అందుకే ఈ ప్రతికూల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడం అత్యవసరం  అని చెప్పారు. 

కొవిడ్-19 ప్రభావంతో సమీప భవిష్యత్ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. సమాజంలోని పేదలకు ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కొవిడ్-19ని కట్టడి చేయడం మీదే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, అనిశ్చితి తొలుగుతుందన్నారు. 

కాగా ఆర్థిక, ద్రవ్య స్థిరత్వం కోసం అవసరమైతే అందుబాటులో ఉన్న మరిన్ని చర్యలకూ సిద్ధంగా ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. దీన్ని బట్టి కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు కీలకమైన రెపో రేటును మరింత తగ్గించేందుకూ ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.