న్యూఢిల్లీ: ఇప్పటివరకు దేశీయ రియల్టీ రంగానికి కరోనా వైరస్‌ కలిగించిన నష్టం అక్షరాలా లక్ష కోట్లు. ఇది రోజు రోజుకూ మరింత పెరుగుతుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయ రియల్టీ ఎదుర్కొంటున్న కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి, నష్టాలను తగ్గించడానికి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని రియాల్టీ సంఘాలు క్రెడాయ్, నరెడ్కో కోరాయి. 

వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగం రియల్‌ ఎస్టేట్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగదు కొరత తీవ్రమై ఈ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు వంటివి తప్పవని క్రెడాయ్‌ నేషనల్‌ చైర్మన్‌ జక్షయ్‌ షా తెలిపారు. లాక్‌డౌన్‌ కొనసాగే కాలాన్ని బట్టి తొలగింపు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.  

ఇళ్లు, ఫ్లాట్లు, ఇళ్ల స్థలాల అమ్మకాల క్షీణతతో రియాల్టీ కంపెనీలు చేసే మొదటి నిర్ణయం వేతనాల తగ్గింపే. లిక్విడిటీ కొరత కారణంగా డెవలపర్లు రుణాల చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్‌ అవుతారు. ఫలితంగా కంపెనీలు దివాళా తీస్తాయి. జీడీపీలో దాదాపు 5 శాతం వాటా కలిగిన దేశీయ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌లో గడిచిన నెలరోజుల్లో విక్రయాలు భారీగా పతనమయ్యాయి. 

also read ఉద్యోగులే కంపెనీలకు చెప్పాలి.. వాటిపై స్పష్టత ఇవ్వాలి... 

ఈ పరిస్థితుల్లో రియాల్టీ సంస్థలకు తమ ఉద్యోగుల తొలగింపులు తప్పదని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్‌ హిర్‌నందానీ తెలిపారు. ప్రభుత్వం రియల్టీ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే.. కంపెనీలు దివాలా తీయడం, ఉద్యోగాలు కోల్పోవటం వంటివి జరగవని తెలిపారు. 

లాక్‌డౌన్‌ కంటే ముందు శ్రామిక శక్తిలో ఉద్యోగుల తొలగింపు 15 శాతమైతే, ప్రస్తుతం అది 25 శాతానికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్‌ హిర్‌నందానీ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత సంక్షోభ కాలంలో స్థిరాస్తి కంపెనీలకు వన్‌టైమ్‌ రుణ పునర్వ్యవస్థీకరణ అవకాశం కల్పించాలని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్‌ హిర్‌నందానీ చెప్పారు. లాక్‌డౌన్‌ తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభం కోసం అదనపు ద్రవ్య లభ్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసిన కస్టమర్లలో 65 శాతం మంది చెల్లింపుల్లో డిఫాల్ట్‌ కావచ్చని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) అంచనా. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు.. బిల్డర్లను చెల్లింపులకు వాయిదా కోరినట్ల్లు ఐసీసీ తెలిపింది. పేమెంట్‌ డిఫాల్ట్‌లు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటోంది.