Asianet News TeluguAsianet News Telugu

కరోనా పేషెంట్ల చికిత్స కోసం అధునాతన ఫీచర్లతో వెంటిలేటర్లు తయారీ....

కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు వైద్య నిపుణులు తీవ్రంగా ఎదుర్కొంటున్న వెంటిలేటర్ల కొరతను తీర్చేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. అందులో భాగంగా కోయంబత్తూర్ కు చెందిన ఓ విద్యార్థి స్టార్టప్ గత నెల 22న ప్రారంభించి నాలుగు రోజుల్లో డిజైన్ తయారు చేసింది. చౌకధరకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తోంది. 

student start up develops low cost ventilators
Author
Hyderabad, First Published Apr 10, 2020, 11:01 AM IST

చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తూ శరవేగంగా విస్తరిస్తూ వేల మందిని పొట్టన పెట్టుకుంటున్నది. మరోవైపు రోగులకు అందిస్తున్న చికిత్సలో కీలక వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ సమయంలో అతి తక్కువ ఖర్చుకే తయారు చేస్తామని ఓ స్టార్టప్ సంస్థ చెబుతోంది. అంతేకాదు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌ తీర్చగల సామర్థ్యం కలిగి ఉన్నదని పేర్కొంటున్నది.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి-స్టార్టప్ జేకే దజ్తా సిస్టమ్స్ ఈ వెంటిలేటర్ అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ వెంటిలేటర్ ప్రాజెక్ట్ ఆధారంగా, రీ-ఇంజనీరింగ్ డిజైన్‌తో తాము ఈ వెంటిలేటర్‌ తయారుచేసినట్లు జేకే దజ్తా సిస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 

గతనెల 22వ తేదీన ప్రాజెక్టును ప్రారంభించిన తాము కేవలం నాలుగు రోజుల్లోనే ఒక నమూనాతో ముందుకొచ్చామని జేకే దజ్తా సిస్టమ్స్ పేర్కొంది. స్థానిక ఈఎస్ఐ  ఆసుపత్రి అనుమతితో పాజిటివ్ ప్రెజర్ బ్రీతింగ్ వెంటిలేటర్ (ఐపీపీవీ) ఇప్పుడు పరీక్షకు సిద్ధంగా ఉందని చెప్పారు. 

also  read  పేదరికంలోకి 40 కోట్ల మంది ఇండియన్లు: 125 కోట్ల మందికి ఉపాధి కరువు

తాము రూపొందించిన ప్రొటోటైప్ ఇంటర్ మిట్టెంట్ పాజిటివ్ ప్రెషర్ బ్రీతింగ్ వెంటిలేటర్ దేశవిదేశాల్లో వెంటిలేటర్లకు ఉన్న భారీ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం కలిగి ఉందని జేకే దజ్తా సిస్టమ్ పేర్కొన్నది. అన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లతో, కొత్తగా రీడిజైన్ చేసిన వెంటిలేటర్ల నమూనాను కేవలం రూ.25 వేల కన్నా తక్కువ ధరకే అభివృద్ధి చేసినట్లు తెలిపింది. 

దీన్ని త్వరలోనే కొయంబత్తూర్ ప్రభుత్వ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో పరీక్షించనున్నామని జేకే దజ్తా సిస్టమ్ ప్రతినిదులు చెప్పారు. రాతినం కాలేజీకి చెందిన బయో మెడికల్, కంప్యూటర్ సైన్స్ విభాగం సహకారంతో కార్తీక్ ఎస్, గౌతమ్, సంతకుమార్ బృందం ఈ వెంటిలేటర్ రూపకర్తలు.

టైడల్ వాల్యూమ్, నిమిషంలో తీసుకునే శ్వాస రేటు, తదితర అన్ని అంశాలను పర్యవేక్షిస్తూ ఈ వెంటిలేటర్ నియంత్రిస్తుందన్నారు. దీంతోపాటు రోగికి అందుతున్న ఆక్సిజన్ స్థాయిని కూడా పర్యవేక్షించేలా మెరుగుపర్చినట్టు తెలిపారు. 

కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో తయారు చేసిన ఈ వెంటిలేటర్ చాలా మంది రోగులకు సహాయం చేస్తుందని ఈ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. పరీక్షల తర్వాత అధిక సంఖ్యలో వాణిజ్య ఉత్పత్తి కోసం ప్రభుత్వ లైసెన్స్ తీసుకుంటామని తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios