పేదరికంలోకి 40 కోట్ల మంది ఇండియన్లు: 125 కోట్ల మందికి ఉపాధి కరువు
కరోనా కరాళన్రుత్యం స్రుష్టిస్తున్న విధ్వంసం మాటల్లో చెప్పలేం. లక్షల కోట్లలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందన్ని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ప్రత్యేకించి అసంఘటితరంగం కోలుకోవడం ఒకింత కష్ట సాధ్యమేనని, ఉపాధి లేక భారతదేశంలో 40 కోట్ల మంది పేదరికంలో మగ్గుతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది.
న్యూయార్క్: భారత అసంఘటిత రంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అభిప్రాయపడింది. ఈ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదవాళ్లుగా మారతారని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని లెక్కగట్టింది.
ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ప్రపంచ వ్యాప్తంగా అసంఘటిత కార్మికులు స్థితిగతులపై ‘‘ఐఎల్‌ఓ మానిటర్: కొవిడ్-19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్’’ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన అతిపెద్ద సంక్షోభం కరోనా మహమ్మారి అని ఈ నివేదిక అభివర్ణించింది.
ఈ కష్టకాలంలో వేగంగా, సరైన రీతిలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గాయ్ రైడర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్నారని వారందరి ఉపాధి ప్రమాదపు అంచులకు చేరిందని నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారనున్నాయని ఐఎల్ఓ అంచనా వేసింది. ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్ భారత్‌లో రోజుకూలీలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రస్తావించింది. వారంతా స్వస్థలాలకు వెళ్లిపోతున్న ఉదంతం గుర్తుచేసింది.
గత 75 ఏళ్ల చరిత్రలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతటి సంక్షోభ పరిస్థితుల్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ఐఎల్‌ఓ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారంతోనే ఈ సంకట స్థితి నుంచి బయట పడగలమని సూచించింది.
ముఖ్యంగా కరోనా వల్ల అత్యంత భారీగా ప్రభావితమైన దేశాలకు అందరూ అండగా ఉండాల్సిన అవసరాన్ని ఐఎల్ఓ గుర్తుచేసింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్‌లో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తామని వ్యాఖ్యానించింది. సరైన చర్యల ద్వారా ఈ సంక్షోభం మిగిల్చే చేదు అనుభవాల్ని కొంతమేర తగ్గించొచ్చని అభిప్రాయపడింది.
also read ఫ్యాక్టరీల్లో కార్మికుల కొరత..సప్లయిలో ఇబ్బందులు... మెడిసిన్స్ ప్రొడక్షన్ ప్రాబ్లం
వసతి, ఆహారం, ఉత్పత్తి, రిటైల్, వ్యాపార, పాలనా రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు ప్రభావితమయ్యారని తేల్చింది.
కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మంది కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని ఐఎల్‌ఓ హెచ్చరించింది. కరోనా వైరస్ కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ తదితర కఠిన చర్యలు వారి ఉద్యోగాలు, ఆదాయ సంపాదనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా నివేదికలో పేర్కొంది. అంతేకాదు, వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతున్నారని అంటోంది.
ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ప్రపంచవ్యాప్తంగా 6.7 శాతం పని గంటలు తుడిచిపెట్టుకుపోవచ్చునని ఐఎల్ఓ తెలిపింది. ఇది 19.5 కోట్ల ఫుల్‌టైం కార్మికులు చేసే పనికి సమానం అని పేర్కొంది.
పని గంటల తరుగుదల అంటే గల్ఫ్ దేశాల్లో 8.1 శాతం లేదా 50 లక్షల ఫుల్‌టైం జాబ్స్ అత్యధికంగా కోల్పోవచ్చు. అది యూరప్‌లో 7.8 శాతం లేదా 1.2 కోట్ల ఫుల్‌టైం జాబ్స్, ఆసియా, ఆసియా పసిఫిక్‌లో 7.2 శాతం లేదా 12.5 కోట్ల ఫుల్ టైం జాబ్స్ తగ్గిపోతాయని ఐఎల్ఓ వ్యాఖ్యానించింది.
‘ఆయా ఆదాయ వర్గాల వారు భారీ నష్టపోవచ్చు. ఎగువ మధ్య తరగతి వారు అత్యధికంగా 7 శాతం మేర నష్టపోవచ్చు. ఇది 2008-09 ఆర్థిక సంక్షోభ ప్రభావం కంటే అధికం. హోటళ్లు, ఆహార సేవలు, వస్తు తయారీ, రిటైల్, బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రంగాలు అధికంగా ప్రభావితం కానున్నాయి’ అని ఐఎల్ఓ వెల్లడించింది.
‘ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్త నిరుద్యోగులను తొలుత 2.5 కోట్లుగా అంచనా వేశాం. కరోనా సంక్షోభం నేపథ్యంలో సంఖ్య అంతకంటే ఎక్కువగానే నమోదు కావచ్చు’ అని ఐఎల్ఓ అంచనా వేసింది.