సినిమాలు, షికార్లకంటే..ఆరోగ్యం, నిత్యావసరాలకే వారి ఎక్కువ ప్రాధాన్యతా...తాజా సర్వే వెల్లడి..
కరోనా వైరస్ విసిరిన సవాల్ సామాన్యుడిని అతలాకుతలం చేస్తోంది. దేశమంతా ఆర్థిక అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ప్రజలంతా తక్కువ ఖర్చు చేసి, భారీగా పొదుపు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారని.. దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల నూతన మంత్రమిదేనని నీల్సన్ తాజా సర్వేలో తేలింది. లాక్డౌన్ తర్వాత ప్రజల కొనుగోలు తీరు మారనున్నదని, లగ్జరీ కంటే, నిత్యావసర వస్తువులకే ప్రాముఖ్యం ఇస్తారని, సినిమాలు.. షికార్లకు సెలవు పెట్టి, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారని ఈ సర్వే నిగ్గు తేల్చింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రజల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విలాస వస్తువులు, సినిమాలు, షికార్లకంటే, నిత్యావసర సరుకులకు, ఆరోగ్యానికి, ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నీల్సన్ తాజా సర్వే వెల్లడించింది.
తక్కువ ఖర్చు పెట్టాలని, ఎక్కువ పొదుపు చేయాలనేది ఇప్పుడు వారి మంత్రమని నీల్సన్ పేర్కొంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం మానేసి.. హెల్త్, పరిశుభ్ర పరికరాలపైనే అందరూ ఫోకస్ చేస్తారని వివరించింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 64 శాతం మంది లాక్డౌన్ తర్వాత తాము రెస్టారెంట్లు, మూవీలకు వెళ్లడం తగ్గిస్తామని చెప్పారని తెలిపింది.
నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమలు, సబ్బులు తదితరాలను కొని పెట్టుకోవడంపై ప్రజలంతా దృష్టి పెడతారని నీల్సన్ తాజాగా నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. దేశంలో కరోనా ప్రభావంపై 23 నగరాల్లోని 1,330 మందిపై ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 మధ్య ఈ ఆన్లైన్ సర్వే జరిపింది.
సర్వేలో పాల్గొన్న 43 శాతం మంది ఫ్యాషన్, పర్సనల్ గ్రూమింగ్, హోం డెకరేషన్‌కు పెద్దగా ఖర్చు పెట్టబోమని చెప్పారు. 54 శాతం మంది ఆటోమొబైల్స్ కొనుగోళ్లపై ఎక్కువ స్పెండ్ చేయమని చెప్పారు. ఖర్చులు తగ్గించుకుని, సొమ్ము ఆదా చేయడానికే ప్రజలు ఆసక్తి చూపుతారని ఈ సర్వే తేల్చింది.
also read ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము...విమాన టికెట్ బుకింగ్‌లు నిలిపేవేత...
కరోనా ఎఫెక్ట్ ముగిసిన తర్వాత ప్రజా రవాణా, షేర్డ్ ట్రాన్స్పోర్ట్ కంటే వ్యక్తిగత వాహనాలను వాడేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతారని భావిస్తుండగా జనం ఆలోచన వేరేగా ఉండటం విశేషం. ఆర్థిక అస్థిరతే దీనికి కారణమని నిఫుణులు చెబుతున్నారు. 54 శాతం మంది లగ్జరీ ప్రొడక్ట్స్, అనవసర ప్రయాణాలు పెట్టుకోమని చెప్పారు.
వ్యక్తిగత పరిశుభ్రతకు, సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని దాదాపు 56 శాతం మంది చెప్పారు. హెల్దీ, ఆర్గానిక్ ఫుడ్, మెడికల్ నీడ్స్, ఫిట్నెస్, మెడికల్ ఇన్సూరెన్స్‌పై ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు. భవిష్యత్‌లో బయట ఆహారం తినడంకన్నా ఇంట్లో వండిన ఫుడ్ తినడానికే జనం ఎక్కువ మొగ్గుచూపుతారని తేలింది.
ఇంట్లోనే ఉండి.. హెల్దీ ఫుడ్ వండుకోవడానికి ఇష్టపడతారని మ్యారీకో ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా చెప్పారు. ‘‘కస్టమర్ల విశ్వాసాన్ని మళ్లీ పొందడానికి బ్రాండ్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే వారికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేయాలి”అని పిజ్జా హట్ మార్కెటింగ్ డైరెక్టర్ నేహ చెప్పారు.
లాక్డౌన్ ఎత్తేసి సాధారణ పరిస్థితులు ఏర్పడినా.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపకపోవచ్చని నీల్సన్ గ్లోబల్ కనెక్ట్ దక్షిణాసియా మార్కెట్ లీడర్ సమీర్ శుక్లా తెలిపారు.
ఎయిర్ లైన్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, మెట్రోలు ఇలా ఏవీ దీనికి మినహాయింపు కాదని నీల్సన్ గ్లోబల్ కనెక్ట్ దక్షిణాసియా మార్కెట్ లీడర్ సమీర్ శుక్లా చెప్పారు. గూడ్స్, సర్వీసులను అందించడంలో హైజీన్ అనేది బ్రాండ్లకు భవిష్యత్‌లో ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందన్నారు.