ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము...విమాన టికెట్ బుకింగ్‌లు నిలిపేవేత...
టికెట్ బుకింగ్‌లపై ఎయిర్‌ఇండియా స్పష్టతనిచ్చిది. ప్రభుత్వ ప్రకటన తర్వాతే సేవలు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. బుకింగ్‌లు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు టిక్కెట్ బుకింగ్ లు తీసుకోవద్దని ప్రైవేట్ విమానయాన సంస్థలను కూడా డీజీసీఏ తాజాగా ఆదేశించింది.
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు టికెట్ బుకింగ్ నిలిపేసినట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ప్రకటించింది. విమాన సేవల ప్రారంభంపై ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతే టిక్కెట్ బుకింగ్‌లు స్వీకరించాలని విమాన సంస్థలకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పురి సూచించారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల బుకింగ్ నిలిపివేయాలని ఎయిర్ ఇండియా ఆదివారం నిర్ణయం తీసుకుంది.
వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు జూన్ 1 నుంచి సర్వీసులు నడుపనున్నట్లు శనివారం ఎయిర్‌ఇండియా ప్రకటించింది. ఇందుకోసం బుకింగ్‌లు తీసుకుంటున్నట్లు సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. జూన్, జూలైలలో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.
కానీ కేంద్ర మంత్రి హర్డీప్ సింగ్ పూరి ప్రకటన తర్వాత వెబ్‌సైట్ నుంచి ఆ నోటిఫికేషన్ కూడా ఎయిర్‌ఇండియా తొలగించింది. ప్రైవేటు సంస్థలు మాత్రం ఇంకా బుకింగ్‌లు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థలూ బుకింగ్‌లు నిలిపేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశించింది. ప్రభుత్వ ప్రకటన తర్వాతే బుకింగ్‌లు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
మరోవైపు లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని సంస్థల ప్యాసింజర్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్ పొడిగింపుతో మే 3 వరుకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని ప్రముఖ బడ్డెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ చేతులెత్తేసింది.
also read అక్షయ తృతీయ స్పెషల్: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్...
దాదాపు 5,500 మంది ఉద్యోగులను మే 3 వరకు వేతనాలు లేని సెలవులపై పంపేందుకు ప్రముఖ బడ్డెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ సిద్ధమైంది. ప్రస్తుతానికి సంస్థ కార్యకలాపాలు లేనప్పటికీ దాదాపు 5,500 ఉద్యోగుల్లో 10 శాతం మందిని.. కచ్చితంగా నిర్వహించాల్సిన కొన్ని కార్యకలాపాలకు వినియోగించుకోనున్నట్లు తెలిపింది.
వారికి నామమాత్రపు వేతనాలు చెల్లించనున్నట్లు ప్రముఖ బడ్డెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ వెల్లడించింది. వాడియా గ్రూప్‌నకు చెందిన గోఎయిర్ సంస్థ మార్చిలోనూ ఉద్యోగులకు వేతనాలు లేని సెలవులు తీసుకోమని కోరింది.
మే 4 నుంచి విమాన సేవలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు గో ఎయిర్ పేర్కొంది. లాక్‌డౌన్ తర్వాత దశల వారీగా సేవలు ప్రారంభిస్తామని తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కూడా గోఎయిర్ బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది.
స్పైస్ జెట్ ఉద్యోగుల్లో రూ.50,000 కన్నా ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగులను రోటేషన్ పద్ధతిలో జీతంలేని సెలవులపై పంపనున్నట్లు తెలుస్తోంది.ఇది వరకే మార్చి 25 నుంచి 31 మధ్య సంస్థ ఉద్యోగుల్లో చాలా మందిని వేతనాలు లేని సెలవులపై పంపింది. ఇండిగో వచ్చేనెల 31 వరకు విమాన టిక్కెట్ల బుకింగ్ మూసివేసింది.