ముంబై: రుణాల చెల్లింపులపై మరో మూడు నెలలపాటు మారటోరియాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపు విషయమై మారటోరియం పెంచాలన్న ప్రతిపాదనను ఆర్బీఐ గట్టిగా పరిశీలిస్తున్నది. 

ఇప్పటికే అన్ని రకాల రుణాలపై ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మూడు నెలల వెసులుబాటును ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 31తో ఈ గడువు తీరిపోతున్నది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఈఎంఐలపై మారటోరియం తీసుకునే వీలును రుణగ్రహీతలకు కల్పించాలని బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మార్చి 27న ఆర్బీఐ సూచించింది.

కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. దీన్ని ఇటీవలే ఈ నెల 17దాకా పొడిగించారు. 

also read  లాక్‌డౌన్ ఎఫెక్ట్: మరో 'బ్లాక్ మండే'గా రికార్డు.. 5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..

అయితే, లాక్‌డౌన్‌ పొడిగించడం, ఎత్తివేత తర్వాత కూడా రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడం వంటి అంశాల కారణంగా మారటోరియంను పొడిగించడమే శ్రేయస్కరమని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరటనివ్వగలదని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీంతో భారతీయ బ్యాంకుల సంఘం సహా వివిధ వర్గాల నుంచి వివిధ రుణాలపై మారటోరియాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తులు ఆర్బీఐకి వస్తున్నాయి. 

ఈ క్రమంలోనే ఈ అంశాన్ని ఆర్బీఐ చురుగ్గా పరిశీలిస్తున్నది. మారటోరియం పెంచితే జూన్‌, జూలై, ఆగస్టు నెలల ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాలను బ్యాంకులు తర్వాతి కాలంలో వసూలు చేసుకుంటాయి.