ఐటీ’కీ కష్టకాలమే: సుదీర్ఘ కాలం లాక్ డౌన్‌తో ఉద్యోగాల కోత ఖాయమే!

సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కొనసాగితే మాత్రం ఐటీ సంస్థలకు గడ్డుకాలమేనని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు తప్పవన్నారు. కరోనా ఎఫెక్ట్ స్టార్టప్ సంస్థల ఉసురు తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
Prolonged lockdown may result in IT industry job cuts; pose huge challenge for startups, says ex-NASSCOM chief R Chandrashekhar
హైదరాబాద్‌: సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ కొనసాగడం మూలంగా ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ సంకేతాలిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి దీర్ఘకాలంలో సానుకూలంగా ఉండవచ్చని, ఐటీ కంపెనీల పెట్టుబడుల ఆదాకు అవకాశం ఉంటుందని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. వెంచర్‌ క్యాపిటలిస్టుల నిధులతో స్టార్టప్స్‌ మనుగడ సాగిస్తున్నాయని, ప్రస్తుత పరిణామాలు ఇంకా దిగజారితే ఈ సంస్థలు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కరోనా మహమ్మారి స్టార్టప్ కంపెనీల ఉసురు తీస్తుందని చెప్పారు. 

‘‘పెద్ద కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోకుండా ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమిటంటే.. వారు తమ ఉద్యోగులను కోల్పోవాలనుకోరు. ఆయా కంపెనీల వద్ద తగినంత సొమ్ము ఉంది. పెద్ద కంపెనీల్లో కొన్ని ఉద్యోగులను తొలగించాలనుకుంటే.. తాత్కాలిక ఉద్యోగులను తగ్గించుకోవచ్చు’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

‘పెద్ద ఐటీ సంస్థలు కానీ రెగ్యులర్‌, శాశ్వత ఉద్యోగులను కోల్పోవాలనుకోరు. అయితే 2,3 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే వాటిపై కూడా ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సబ్సిడీలు కొనసాగిస్తూ ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఎంతకాలం అది కొనసాగుతుందన్నదే ప్రశ్న’’ అని చంద్రశేఖర్‌ అన్నారు. 

also read ఇదే మంచి ఛాన్స్! ఫేస్‌మాస్క్ బిజినెస్‌లో ఈ రిటైలర్లు !!

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తం గా చాలా కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ పాలసీకే  ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది స్వల్పకాలంలో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపినా దీర్ఘకాలంలో ఇది పని సంస్కృతిని మార్చే అవకాశం ఉందని చంద్రశేఖర్ చెప్పారు. 

అయితే, వర్క్ ఫ్రం హోం పాలసీ ప్రకారం కార్యాలయంలో మాదిరిగా ఇంటి నుంచి పని చేయడం అంత సులభం కాదని చంద్రశేఖర్ వెల్లడించారు. కానీ కరోనా వైరస్ మన అలవాట్లను శరవేగంగా మార్చి వేస్తున్నదన్నారు. ఖాతాదారులు (క్లయింట్స్) కూడా వర్క్ ఫ్రం హోం సంస్క్రుతిని అంగీకరిస్తారని అభిప్రాయ పడ్డారు.

మరికొన్ని నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే ఐటీ రంగంలోని పెద్ద కంపెనీల్లోనూ ఉద్యోగ కోతలు తప్పదని చంద్రశేఖర్ అన్నారు. లాక్ డౌన్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే మాత్రం చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. 

ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగాల్లో కోత విధించక తప్పదని చంద్రశేఖర్ చెప్పారు. పెద్ద కంపెనీల్లో తొలగింపునకు గురైన వారు ఉంటే వారి పని తీరు బాగా లేకపోవడం గానీ, తాత్కాలిక ఉద్యోగులై ఉండటం గానీ కావచ్చునన్నారు.

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమకు డిమాండ్‌ తగ్గుతుందని భావిస్తున్నట్టు నాస్కామ్‌ మాజీ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుండే అవకాశం లేదన్నారు. అన్ని ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కాబట్టి డిమాండ్‌  తగ్గడానికి అవకాశం ఉందని చెప్పారు. 

కరోనా వైరస్‌ సంక్షోభం ఉద్యోగుల్లో నిరుద్యోగ భయాలను రేకెత్తిస్తున్నది. లాక్‌డౌన్‌పై స్పష్టత లేకపోవడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? ఉండవా? అన్న సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. రోజురోజుకూ వీరి సంఖ్య పెరిగిపోతుండగా, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios