భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నవేళ ప్రాజాలను ఆదుకోవడానికి ప్రభుత్వానికి భారీ స్థాయిలో నిధుల ఆవశ్యకత ఉన్న విషయం అందరికీ తెలిసిందే! అసలే ఆర్ధిక రాబడికి ఉన్న అన్ని దారులూ కూడా మూసుకుపోయిన విషయం తెలిసిందే. 

ఇందుకోసమని ప్రధాని ఈ కరోనా ఆపత్కాలీన సమయంలో పీఎం కేర్స్ అనే నిధిని ఏర్పాటు కూడా చేసారు. ఇలా అవసరమైన డబ్బును సమకూర్చుకుంటూనే ఆర్థికక్రమశిక్షణను పాటించడంతోపాటుగా ఖర్చును కూడా తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యారు. 

ఇందుకోసమని రాష్ట్రపతి, ప్రధానితో సహా అందరు ఎంపీలు, అన్ని రాష్ట్రాల గవర్నర్ల వేతనంలో ఒక సంవత్సరంపాటు 30 శాతం కోత విధిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు తెలియజేశారు. 

అందరూ మంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, రాష్ట్రపతి గారు కూడా స్వచ్చంధంగా ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఎంపీల పెన్షన్లు, అలవెన్సుల విషయంలో ఎటువంటి కొత్త ఉండబోదని ఆయన తెలిపారు. ఈ డబ్బునంతా కన్సాలిడేటెడ్ ఫండ్ అఫ్ ఇండియాలో జమచేస్తున్నట్టు ప్రకాష్ జవదేకర్ తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విధంగా కొత్త విధించిన విషయం తెలిసిందే. కాకపోతే కేసీఆర్ గారు 70 శాతం కొత్త విధించారు. ఇలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కేసీఆర్ నిర్ణయాన్నే కేంద్రం ఫాలో అయ్యిందంటూ అసదుద్దీన్ ఒవైసి ట్వీట్ చేసారు. 

ఇకపోతే దేశంలో కరోనా అంతకంతకు విజృంభిస్తుంది. కేసుల సంఖ్య సోమవారం నాటికి 4,067కి చేరుకొంది. గత 24 గంటల్లో కొత్తగా 693 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సోమవారం నాడు సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 109 మంది మృతి చెందారు. దేశంలో నమోదైన 4067 కరోనా కేసుల్లో 1445 కేసులు ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చినవారేనని కేంద్రం ప్రకటించింది.

Also read:కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం

కరోనా వైరస్ సోకినవారిలో 76 శాతం మంది పురుషులే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ చెప్పారు.47 శాతం కరోనా కేసులు 40 ఏళ్లలోపు వయస్సు వాళ్లకు సోకిందని కేంద్రం తేల్చింది. 34 శాతం కేసులు 40 నుండి 60 ఏళ్ల వయస్సు మధ్య వారికి సోకిందని లవ్ అగర్వాల్ చెప్పారు.

మృతి చెందిన వారిలో 30 మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు.63 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే మృత్యువాతపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారితో పాటు వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన సుమారు 25 వేల మందిని క్వారంటైన్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.దేశ వ్యాప్తంగా 291 మంది ఈ వ్యాధి నుండి కోలుకొన్నారని కేంద్రం తెలిపింది.