ముంబై: డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ముంబైలో ఓ మహిళకు మూడు రోజుల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. వైద్యులు చేసిన తప్పుకు తన కుటుంబ సభ్యులు ఈ వైరస్ బారిన పడ్డారని  ఓ వ్యక్తి  ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేలకు చెప్పారు.

ముంబైలోని చెంబూరు శివారులో నివసిస్తున్న ఓ వ్యక్తి  గత వారం తన భార్యను ప్రసవం కోసం స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే వారం రోజుల తర్వాత ఆమె ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఉన్న గదిలోనే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న రోగిని చేర్చారు. ఈ విషయాన్ని తమకు చెప్పలేదని ఆ వ్యక్తి చెబుతున్నాడు. 

Also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: యూపీలో మహిళను కాల్చి చంపిన జవాన్

అయితే తన భార్యతో పాటు మూడు రోజుల చిన్నారికి కరోనా సోకిందని ఆయన చెప్పాడు. ప్రతి రోజూ అదే ఆసుపత్రిలో ఉండి చికిత్స నిర్వహించుకొంటామని చెప్పినా కూడ వినలేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసుపత్రి నుండి తమ వారిని బలవంతంగా బయటకు పంపారని చెప్పారు. తన భార్య, బిడ్డతో పాటు తన కోసం పరీక్షల కోసం రూ.13,500 ఖర్చు చేసినట్టుగా అతను చెప్పాడు.

ప్రస్తుతం కస్తూర్బా ఆసుపత్రిలో తన వాళ్లు చికిత్స పొందుతున్నారన్నారు. తన కుటుంబాన్ని కాపాడాలని కోరుతూ ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ఆయన వేడుకొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహారాష్ట్రలో 280 కేసులు నమోదు కాగా, ఇప్పటికే 13 మంది మృతి చెందారు.