లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి పేర్ల జాబితాలో తనతో పాటు తన కుటుంబం పేరు చేర్చడంపై ఆ జవాన్ సహనం కోల్పోయి కాల్పులు జరపడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఈ నెల 14వ తేదీ వరకు అమల్లో ఉంది..

లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుండి గ్రామానికి వచ్చిన వారి  పేర్ల జాబితాను  తయారు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అలీపూర్ గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామంలోకి ఎవరొచ్చినా కూడ వారి సమాచారాన్ని అధికారులకు ఇచ్చేందుకు గ్రామ పెద్దలు కొత్తగా గ్రామానికి వచ్చిన వారి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయం తీసకొన్నారు. 

గ్రామానికి కొత్తగా వచ్చిన వారి సమాచారాన్ని సేకరించాలని వినయ్ యాదవ్ అనే వ్యక్తిని పురమాయించారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తా నుండి గ్రామానికి వచ్చిన  శైలేంద్ర అనే ఆర్మీలో పనిచేసే వ్యక్తి పేరుతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేర్లను వినయ్ యాదవ్ సేకరించారు.

also read:ఎయిమ్స్ డాక్టర్ కు కరోనా: ఢిల్లీలో ఏడుగురు డాక్టర్లకు పాజిటివ్

గ్రామానికి కొత్తగా వచ్చిన వారి పేర్ల జాబితాలో తనతో పాటు తన కుటుంబసభ్యుల పేర్లను ఎందుకు చేర్చావని జవాన్ శైలేంద్ర  వినయ్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనతో గొడవకు దిగాడు.  వినయ్ తో పాటు ఆయన సోదరుడిని శైలేంద్ర దుర్బాషలాడారు. మాటా మాటా పెరిగింది. ఈ సమయంలో వినయ్ కు ఓ మహిళ అడ్డుగా నిలిచింది. 

కోపాన్ని ఆపుకోలేని శైలేంద్ర  తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో ఆ మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు శైలేంద్రపై కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు.