కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి భారతదేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు అన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసేశాయి.

దీంతో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి చేరుకోవడానికి సుమారు 135 కిలోమీటర్లు దూరం ఎలాంటి ఆహారం తీసుకోకుండా నడుచుకుంటూ వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. చంద్రపూర్ జిల్లా సావోలి తహసీల్ పరిధిలోని జంబ్ గ్రామానికి చెందిన నరేంద్ర షెల్కే పూణేలో కూలిగా పనిచేస్తున్నాడు.

Also Read:కరోనా లాక్ డౌన్: 21 రోజులు సరిపోదా, పొడిగిస్తారనడంలో వాస్తవమెంత...?

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో అతను తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను పూణే నుంచి నాగపూర్‌కు వెళ్లే చివరి రైలును అందుకోగలిగాడు.

అయితే తర్వాత ప్రభుత్వం అన్ని రకాల రవాణా సౌకర్యాలను నిలిపివేయడంతో నరేంద్ర నాగపూర్‌లో చిక్కుకుపోయాడు. దీంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో నాగపూర్-నాగ్‌భీద్ జాతీయ రహదారిపై తన గ్రామానికి చేరుకోవడానికి నడక ప్రారంభించాడు.

ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు తాగి షెల్కే రెండు రోజుల పాటు నడిచాడు. బుధవారం రాత్రి నాగపూర్‌కు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిందేవాహి తహసీల్‌లోని శివాజీ స్క్వేర్ వద్ద ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం అలసిపోయిన షెల్కేను గుర్తించింది.

Also Read:కరోనా వైరస్ ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే...

కర్ఫ్యూను ఉల్లంఘించిన కారణంగా అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత జరిగినదంతా చెప్పాడంతో ఖాకీలు సైతం జాలిపడ్డారు. అతనిని వెంటనే సింధేవాహీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించి నరేంద్ర షెల్కేకు ఇచ్చాడు.

ఆ తర్వాత వైద్యుల అనుమతితో సింధేవాహికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంభ్ గ్రామానికి నరేంద్రను తీసుకెళ్లేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా షెల్కేను 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.