ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా.. ఈ వైరస్ ఆరోగ్యవంతులతో పోలిస్తే..  అంతకముందే ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కువగా సోకుతుందని అధికారులు గుర్తించారు.
 
బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ త్వరగా సోకే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఐసీఎంఆర్( ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) ఓ నివేదిక విడుదల చేశారు. మొదటి దశలో ఒక వ్యక్తి నుంచి సరాసరిగా 1.5 వ్యక్తులకు వైరస్ సోకే అవకాశం ఉందని చెప్పారు.

Also Read కరోనా అంటూ మహిళపై పాన్ ఉమ్మేసిన వ్యక్తి అరెస్టు...

అదే తీవ్ర దశలో ఒకరి నుంచి నలుగురికి వ్యాపించగలదని ఐసీఎంఆర్ అంచనా వేసింది. సాంక్రమిక వ్యాధుల లక్షణం ఆధారంగా రీప్రొడక్షన్ నంబర్ (ఆర్-నాట్) విధానంలో నిర్ణయించిన ఈ తాజాగా గణాంకాలు... ఓ ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి ఎంత  త్వరగా వ్యాపిస్తుందో తెలియజేస్తాయి. ఈ విలువ 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ త్వరగా అంతరించిపోతుందని అర్థం. అలా కాకుండా ఇద్దరి కంటే ఎక్కువ మందికి సోకిందంటే.. పరిస్థితి చేయ్యి జారిపోయిందని గుర్తించాలన్నారు.

కాగా ‘‘భారత్‌లో కరోనావైరస్ 2019ను నియంత్రించడానికి అనుసరించాల్సిన ప్రజారోగ్య వ్యూహాలు- గణిత నమూనా ఆధారిత విధానం’’ పేరుతో వెలువరించిన ఈ అధ్యయనం కోసం ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అప్పటికి మన దేశంలో ఇంకా కరోనా రెండో దశ ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం దేశంలో 600మంది ఈ మహమ్మారి బారిన పడగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 శాతం మంది కరోనా అనుమానిత కేసులను మూడు రోజుల్లోగా క్వారంటైన్ చేయగలిగితే.. మొత్తం కేసుల సంఖ్యను 62 శాతం నుంచి 89 శాతం వరకు తగ్గించవచ్చునని తాజా అధ్యయనం చెబుతోంది.