టీ అమ్మిన వ్యక్తికి కరోనా: క్వారంటైన్‌లోకి సీఎం సెక్యూరిటీ సిబ్బంది
మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే భద్రతా సిబ్బందికి కోవిడ్ 19 సెగ తాకింది
మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే భద్రతా సిబ్బందికి కోవిడ్ 19 సెగ తాకింది.
సీఎం సెక్యూరిటీ సిబ్బందికి టీ అందించిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఉద్థవ్ థాక్రేకు సెక్యూరిటీగా ఉన్న 170 మంది పోలీసులు, ఇతర అధికారులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
Also Read:ఫేక్ న్యూస్ పోస్టు చేసిన కిరణ్ బేడీ: నెటిజన్ల ఆగ్రహం
వివరాల్లోకి వెళితే.. ఉద్థవ్ థాక్రే నివాసం మాతో శ్రీ సమీపంలోని ఓ ఛాయ్ వాలాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. లాక్‌డౌన్ విధించడానికి ముందు సీఎం భద్రతా సిబ్బంది అంతా అతని ఛాయ్ షాపు వద్దే టీ తాగారు.
దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. మొత్తం భద్రతా సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి పంపారు. ముంబై బాంద్రా ఈస్ట్‌లోని నార్త్ ఇండియన్ సంఘ్ భవనంలో వారిని నిర్బంధించినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో ముంబై నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్థవ్ నివాస ప్రాంతాన్ని కరోనా నియంత్రణ జోన్‌గా ప్రకటించడంతో పాటు సీఎం ఇంటి పరిసరాల్లో స్ప్రేయింగ్ చేశారు.
Also Read:సెప్టెంబర్ వరకు లాక్ డౌన్..? సోషల్ మీడియాలో న్యూస్ వైరల్
మరోవైపు ఉద్ధవ్ థాక్రే గత కొద్దిరోజులుగా భద్రతా సిబ్బందితో సామాజిక దూరాన్ని పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన కారును తానే డ్రైవింగ్ చేసుకుంటూనే పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల సీఎంను ఎవరెవరు కలిశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 748 మందికి కరోనా వైరస్ సోకగా, 45 మంది మరణించారు.