న్యూఢిల్లీ: మనుష్యుల ప్రాణాలను కాపాడేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించడం అవసరమేనని భారత పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కొవిడ్-19 కారణంగా స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఉద్దీపన పథకం అవసరం అని వ్యాఖ్యానించాయి. 

మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశవ్యాప్త లాక్ డౌన్‌ను మే మూడవ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా ప్రజ్వలిత ప్రాంతాలు కాని చోట ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఆంక్షలు సడలిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గత నెలలో వివిధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అయితే, అది పూర్తిగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు మేలు చేసేది గానే ఉంది. కానీ పారిశ్రామిక రంగాలకు ఆలంబన కలిగించే అంశాలేవీ కనిపించలేదు. 

ఈ నేపథ్యంలో రెండో ప్యాకేజీని ప్రకటించాలని వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. ‘లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు రూ.40 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. అంటే 21 రోజుల్లో మొత్తం రూ.7.8 లక్షల కోట్లు అన్న మాట’ అని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతారెడ్డి వ్యాఖ్యానించారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో నాలుగు కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని సంగీతారెడ్డి పేర్కొన్నారు. వెంటనే పారిశ్రామిక రంగానికి సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈ నెల 20 తర్వాత ఆంక్షలు సడలిస్తే వ్యాపారాలు ప్రారంభం అవుతాయని సంగీతారెడ్డి అంచనా వేశారు. 

also read భగ్గుమంటున్న బంగారం ధరలు... డిసెంబర్ కల్లా 10గ్రా పసిడి ధర...

కొవిడ్-19 వ్యాపించకుండా పారిశ్రామిక రంగంతోపాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పటిష్ఠ చర్యలు అవసరం అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాపించకుండా చేపట్టేందుకు కఠిన చర్యలు చేపడుతూ ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్‌ను పొడిగించారని గుర్తు చేశారు. 

‘ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఆంక్షలు సడలిస్తాం’ అని అంటూ ప్రధాని మోదీ 
లాక్ డౌన్ ఎత్తివేత ప్రణాళికలు వెల్లడించారు. పరిశ్రమలకు ఇది మేలు చేస్తుంది. ఆర్థిక వ్యవస్థను వ్యవస్థీక్రుతం చేయడానికి, పరిస్థితులను చక్కదిద్దేందుకు పొడిగింపు కాలం ఉపయోగ పడుతుంది. ఈ సమయంలో పరిశ్రమలు సైతం కొత్త వ్యూహాలు రచించుకోవాలి’ అని చంద్రజిత్ బెనర్జీ సూచించారు. 

కొవిడ్-19ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ పొడిగింపు ఉపయోగపడుతుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత తమకు సాయం చేయాలని కోరింది. ‘ఆంక్షలు సడలిస్తామని చెప్పడం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం ఉద్దీపన పథకం ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. అప్పుడు ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే విషయమై ద్రుష్టి సారిస్తాం’ అని నాస్కామ్ తెలిపింది.

కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ అమలు, వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించడం శరణ్యం అని హిందూస్థాన్ పవర్ చైర్మన్ రాతుల్ పూరి చెప్పారు. ‘లాక్ డౌన్ పొడిగింపు మంచి ఆలోచన. రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయో? లేదో? అన్న సంగతిని చూసిన తర్వాత ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఆంక్షలు సడలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం’ అని జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ తెలిపారు. 

పురోగతి సాధించిన ప్రాంతాల్లో ఈ నెల 21 నుంచి సడలింపులు ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే.. వివిధ రంగాల పరిశ్రమలు ఉత్పాదక చర్యలు ప్రారంభించేందుకు ఉద్దీపనలు ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. అది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.