Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు గుడ్ న్యూస్ : జీతాలతో పాటు బోనస్‌ కూడా...

ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు అండదండలనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని సంస్థలు పూర్తి వేతనాలతోపాటు బోనస్‌ కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులకు అవసరమైన వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక పెద్ద సంస్థల్లో ప్రస్తుతానికి వేతనాల్లో కోత ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

IT Companies Came Forward To Support Employees Financialy
Author
Hyderabad, First Published Apr 29, 2020, 2:54 PM IST

హైదరాబాద్: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో వేతనాల కోత ఉంటుందని చాలా మంది భావించారు. అయితే అందుకు భిన్నంగా కంపెనీలు ఏప్రిల్‌ నెలకుగాను పూర్తి స్థాయి వేతనాన్ని ఇవ్వనున్నాయి. మరి కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకేసి బోనస్, వేతనాల పెంపు ప్రకటించాయి. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఉద్యోగుల బ్రాడ్‌బ్యాండ్‌ ఖర్చులను భరిస్తున్న సంస్థలూ ఉండడం విశేషం. ఇంకొన్ని కంపెనీలైతే ఇన్వర్టర్ల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. పదోన్నతులు ప్రకటించిన సంస్థలూ ఉన్నాయి. ఏదైతేనేం జీతాల కోత లేకపోవడం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశమే. 

మధ్య, పెద్ద తరహా కంపెనీల్లో పరిస్థితి ఇలా ఉంటే, సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలు, స్టార్టప్స్‌ సంస్థల్లో మాత్రం వేతనాల కోత ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఒక్క హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని సమాచారం.

ఈ కష్ట సమయంలో ఉద్యోగులకు అండగా ఉంటామని ఐటీ కంపెనీల యాజమాన్యాలు భరోసా ఇస్తున్నాయి. బ్రాడ్రిడ్జ్‌ తన సిబ్బందికి పూర్తి వేతనంతోపాటు రూ.25,000 బోనస్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫ్యాక్ట్‌సెట్‌ పూర్తి వేతనంతోపాటు బ్రాడ్‌బ్యాండ్‌ ఖర్చులు, హెచ్‌సీఎల్‌ పూర్తి వేతనంతోసహా బ్రాడ్‌బ్యాండ్‌ ఖర్చులు, ఇన్వర్టర్‌ వ్యయం భరిస్తోంది. అలైట్‌–ఎన్‌జీఏ జీతాలను పెంచుతోంది.

కాగ్నిజెంట్‌ తన అసోసియేట్‌ లెవెల్‌ ఉద్యోగులకు బేసిక్‌ సాలరీ మీద 25 శాతం జీతం హైక్‌ చేస్తోంది. అమెజాన్‌ జీతాలను పెంచడంతోపాటు పదోన్నతులు కల్పిస్తోంది. యాక్సెంచర్‌ పూర్తి వేతనంతోపాటు బ్రాడ్‌బ్యాండ్‌కు రూ.1,500 చెల్లిస్తుండగా, క్యాప్‌జెమిని పూర్తి వేతనం, బ్రాడ్‌బ్యాండ్‌కు రూ.2,000 అందిస్తోంది. ఇన్వెస్కో వేతనంతోపాటు అదనంగా రూ.4,000 అలవెన్సు జమ చేస్తోంది. ఫినాక్‌ టెక్నాలజీస్‌ అలవెన్సు ప్రకటించింది.

also read  ఐటీ రంగంలో కొత్త నియామకాలు అనుమానమే: తేల్చేసిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ...

ఉద్యోగులకు జీతాల కోత లేకుండా.. పూర్తి స్థాయి వేతనం ఇస్తామని పలు కంపెనీలు ప్రకటించాయి. వీటిలో జేపీ మోర్గాన్‌ ఛేస్, వెల్స్‌ ఫార్గో, బీఎన్‌వై మెలన్, బీఎన్‌పీ పారిబా, ఇంటర్‌ కాంటినెంటల్‌ ఎక్స్ఛ్‌చేంజ్, థామ్సన్‌ రాయిటర్స్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తదితర కంపెనీలున్నాయి.

విప్రో ఉద్యోగులకు పదోన్నతులు, వేతనాల పెంపు లేకున్నా అన్ని స్థాయిల ఉద్యోగులు విధుల్లో ఉన్నా, లేకున్నా పూర్తి వేతనం ఇస్తోంది. పైగా బ్రాడ్‌బ్యాండ్, పవర్‌ బిల్స్‌ ఖర్చులకుగాను రూ.1,500 జమ చేస్తోంది. 

టీసీఎస్‌ పూర్తి వేతనం ఇస్తోంది. ఉద్యోగుల కోత లేదని తెలిసింది. అయితే వేతనాల పెంపు ఇప్పట్లో లేదని సమాచారం. జెన్‌ప్యాక్ట్‌ సైతం టీసీఎస్‌ బాటలో ఉంది. ఈ ఏడాది జీతాల పెంపు, ప్రమోషన్లు లేవని సమాచారం. ఏప్రిల్‌ నెలకు పూర్తి వేతనం చెల్లిస్తోంది.

కరోనాతో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. అందుకనుగుణంగానే ఉన్న ఉద్యోగులను కాపాడుకుంటూ, భవిష్యతఖ అవసరాల కోసం నగదు నిల్వలను సమర్థంగా వినియోగించాలన్నది కంపెనీల భావన అని ఓ సంస్థ కో–ఫౌండర్‌ తెలిపారు.

మధ్య, పెద్ద తరహా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి సమర్థంగా మార్చివేశాయి. మరోవైపు లాక్‌డౌన్‌తో దేశీయ, విదేశీ క్లయింట్లు కొన్ని పనిచేయడం లేదు. దీంతో రావాల్సిన చెల్లింపులు జాప్యం జరగవచ్చునని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. అలా జరిగితే రానున్న కాలంలో వేతనాల్లో కొంత శాతం వాయిదా పడే అవకాశాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి నెలకొంది. 

కరోనా విపత్తుతో ఐటీ రంగంలోని సూక్ష్మ, చిన్న కంపెనీలు, స్టార్టప్స్‌ కుదేలవుతున్న పరిస్థితి. ఇవి ఎప్పటికప్పుడు వచ్చే ఆదాయంతో నెట్టుకొస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఆదాయం రాక పోగా వేతనాలు, అద్దె చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలన్నీ మార్చి నెల వేతనాల్లో భారీగా కోత పెట్టాయి. ఏప్రిల్‌ మాసానికి మొత్తంగా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయని తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios