ఈ ఏడాది భారత వృద్ధి రేటును తేల్చేసిన ఐఎంఎఫ్...కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణం...
భారత్లో 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అత్యధిక స్థాయిలో వృద్ధి రేటు క్షీణించే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అయితే, గత నివేదికల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ దూసుకు పోతున్నట్లు పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్, చైనా మాత్రమే ప్రధానంగా సానుకూల వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది ఐఎంఎఫ్. 2020లో భారత్ 1.9 శాతం, చైనా 1.2 శాతం వృద్ధి రేటును సాధించే వీలుందని ఐఎంఎఫ్ తెలిపింది.
కరోనా వల్ల ఈ ఏడాది పలు దేశాల వృద్ధిరేటు కనిష్ఠ స్థాయికి పడిపోయినా 2021లో తిరిగి పుంజుకుంటాయని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2021లో భారత్ 7.4 శాతం, చైనా 9.2 శాతం, అమెరికా 4.5 శాతం, జపాన్ మూడు శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని వెల్లడించింది.
ఇదిలా ఉంటే కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి జారిపోయిందని ఐఎంఎఫ్ పేర్కొంది. 1930నాటి మాంద్యం తరువాత అంత దారుణ ఆర్థిక స్థితి ఇదేనని విశ్లేషించింది.
2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ – 0.3 శాతం క్షీణత నమోదు చేసుకుంటుందని ఐఎంఎఫ్ వెల్లడించింది భారత్‌కు సంబంధించి 2020 అంచనాలను 5.8 శాతం (జనవరి అంచనా) నుంచి 1.9 శాతానికి కుదించింది. అయితే 2021 భారత్ వృద్ధిరేటు 7.4 శాతం, చైనా 9.2 శాతం వృద్ధి నమోదు చేసుకుంటాయని విశ్లేషించింది.
also read లాక్ డౌన్ పొడిగించడం సరే...మా ప్యాకేజీ సంగతేమిటి..?: కార్పొరేట్ ఇండియా
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో వ్రుద్ధిరేటు -5.9 శాతం, జపాన్ -5.2 శాతం, బ్రిటన్ -6.5 శాతం, జర్మనీ -7.0 శాతం, ఫ్రాన్స్ -7.2 శాతం, ఇటలీ -9.1 శాతం, స్పెయిన్ -8 శాతం, రష్యాలో జీడీపీ -5.5 శాతం నమోదు చేసుకున్నది.
మరోవైపు, భారత దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17.60 లక్షల కోట్లు) నష్టపోతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనావేసింది. తొలి మూడు వారాల లాక్‌డౌన్ వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9 లక్షల కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్‌క్లేస్ అంచనా వేసింది.
అయితే తాజాగా మే 3 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఈ అంచనాలను భారీగా 234.4 బిలియన్ డాలర్లకు బార్ క్లేస్ పెంచింది. వెరసి 2020లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధిరేటు స్వల్పంగా 0.8% ఉంటుందని తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొన్నది.
తొలి 21 రోజుల లాక్‌డౌన్ వేళ దేశంలో 2020లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని బార్ క్లేస్ అంచనా వేసింది, 2020–21లో వృద్ధి 3.5% ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’, ‘0.8 శాతాలుగా’ తగ్గించడం గమనార్హం.
లాక్‌డౌన్ పొడిగించడంతో 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా ఒకశాతం క్షీణత నమోదయ్యే వీలుందని మరో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికాల తదుపరి పరిస్థితి ఏదైనా బాగుంటే, కనీసం ఒకశాతం వృద్ధి నమోదవుతుందనీ ఇక్రా పేర్కొంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్థికవృద్ధి ఏకంగా –15 క్షీణతలో ఉంటుందని ఇక్రా అంచనావేయడం గమనార్హం.