ఆన్‌లైన్ ఆశలు ఆవిరి: అక్షయ తృతీయపై లాక్ డౌన్ ప్రభావం
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం బంగారం కొనుగోళ్లపై పడింది. ఆన్ లైన్ విక్రయాల ఆలోచనలు కూడా బులియన్ మార్కెట్‌కు కలిసి రాలేదు. బంగారం అమ్మకాలు తుడిచిపెట్టుకుపోయాయి. గతంతో పోల్చితే బంగారం అమ్మకాలు 95 శాతం క్షీణించాయి.
ముంబై: అక్షయ తృతీయ ఆశల్ని కరోనా వైరస్ ఆవిరి చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదివారం నగల వర్తకులు ఆన్‌లైన్ అమ్మకాలను అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకపోయింది. ఈసారి విక్రయాలు తుడిచి పెట్టుకుపోయినట్లేనన్న అంచనాలు పరిశ్రమ నుంచి వెల్లడవుతున్నాయి.
‘ఈ అక్షయ తృతీయ అమ్మకాలను లాక్‌డౌన్ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆభరణాల దుకాణాలు పూర్తిగా మూతబడ్డాయి. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుపాల్సిన పరిస్థితి కస్టమర్లకు ఏర్పడింది’ అని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ పీటీఐతో అన్నారు.
ఈ క్రమంలోనే గతంతో పోల్చితే 95 శాతం విక్రయాలు పడిపోవచ్చునని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. నిరుడుతో పోల్చితే ధరలు 52 శాతం పెరగడం కూడా కొనుగోళ్లను దెబ్బ తీసింది.
ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు బులియన్ వ్యాపారులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ముఖ్యంగా ప్రైస్ లాక్ వెసులుబాటును కల్పించారు. బంగారం కొన్నప్పుడు ఏ ధర ఉందో.. అదే ధర నిర్ణీత వ్యవధిదాకా చెల్లుబాటు అవుతుంది. భవిష్యత్‌లో ధరలు పెరిగినా పాత ధరకే బంగారాన్ని తీసుకోవచ్చు.
ఒకవేళ ధరలు తగ్గితే మాత్రం తగ్గిన ధరలే వర్తిస్తాయి. ఇలా కస్టమర్లకు లాభం చేకూర్చేలా పలు ప్రముఖ బంగారం వ్యాపార సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. కాగా, లాక్‌డౌన్ తర్వాత కూడా నగల అమ్మకాలు ఊపందుకుంటాయన్న అంచనాలు లేవని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ స్పష్టం చేశారు.
also read నేడే అక్షయ తృతీయ: కరోనాతో ఆన్‌లైన్ సేల్స్‌కే ‘గోల్డ్’ పరిమితం
ఇక దీపావళి, దంతేరాస్ పైనే ఆశలన్నీ ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు విశిష్ఠమైన స్థానం ఉన్నది తెలిసిందే. గతేడాది అక్షయ తృతీయ రోజున 33 నుంచి 35 టన్నుల పసిడి అమ్మకాలు జరిగాయి.
ఇదిలా ఉంటే వచ్చే అక్షయ తృతీయ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేలకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల మునుపు ఎన్నడూ లేనివిధంగా తులం రూ.47,327ను తాకిన విషయం తెలిసిందే.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ఆదివారం రూ.45,620 పలికింది. అయితే ధరలు ఎక్కువగా పెరుగడం కూడా అమ్మకాలను దెబ్బ తీస్తుందని వ్యాపారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు ఏకంగా 52 శాతం పెరిగాయి.
ఇప్పటికి ప్రజలు క్షుణ్ణంగా బంగారం ఆభరణాలను పరిశీలించుకుని, తమ శరీరంపై వేసుకుని సంత్రుప్తి చెందిన తర్వాతే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే ఆభరణాల సరఫరా సాధ్యమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మే నెలాఖరుకు గానీ, జూన్ నెలలో గానీ పరిస్థితులు కుదుట పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరో ఐదు నెలల వరకు మార్కెట్ మందగమనంలోనే ఉంటుందని వుమ్మిడి బంగారు జ్యుయెల్లర్స్ అంచనా వేసింది. పెండ్లిండ్లు తదితర శుభకార్యాలు కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. సంపన్నులు సైతం ఆడంబరాలకు దూరంగా ఉంటుండటం కొనుగోళ్లను కుదిపేస్తున్నది.