ముంబై/ న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవత్ర తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. అప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఈ విపత్కర పరిస్థితుల్లో సహకరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.

దీంతో అత్యవసర సేవలు మినహా ప్రపంచవ్యాప్తంగా విమానయానం మూగబోయింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ నెల 14నాటికి లాక్‌డౌన్‌ ముగియాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేయలేమని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం అఖిలపక్ష భేటీ తర్వాత పేర్కొన్న సంగతి తెలిసిందే. 

అంతకుముందు కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో సేవలు నిలిపి వేసిన విమానయాన సంస్థలు మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి బుకింగులు స్వీకరణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 

also read పేదరికంలోకి 40 కోట్ల మంది ఇండియన్లు: 125 కోట్ల మందికి ఉపాధి కరువు

విమానాల బుకింగులు స్వీకరిస్తామని, డీజీసీఏ కొత్తగా మార్గదర్శకాలు ఏవైనా జారీ చేస్తే వాటిని అనుసరిస్తామని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఆసియా వెల్లడించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా బుకింగ్స్‌ స్వీకరించొచ్చని పౌర విమానయాన సంస్థ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా గురువారం తెలిపారు. దీంతో ఏప్రిల్‌ 15 నుంచి ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఎయిర్‌ ఆసియా భారత ప్రతినిధి తెలిపారు. 

ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌ దేశీయ సర్వీసులకు ఏప్రిల్‌ 15 నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. విస్తారా సైతం బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌ సంస్థలు మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ను కూడా ప్రారంభించాయి. 

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రం ఏప్రిల్‌ 30 వరకు బుకింగ్స్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌పై తదుపరి నిర్ణయం వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.