న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం నుంచి ఉద్యోగులు, సంస్థలకు ఊరట కల్పించేందుకు వచ్చే మూడు నెలలపాటు వారి ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో)’ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకూ ఇది వర్తిస్తుంది.

ఈ నిర్ణయం వల్ల 6.5 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని, వచ్చే మూడు నెలల్లో వాటికి దాదాపు రూ.6,750 కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులో వస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ 12 శాతం చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు.

పీఎఫ్ కంట్రిబూషన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు మాత్రం 10 శాతమే చెల్లించాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద చిన్న కంపెనీలకు ప్రకటించిన పీఎఫ్‌ సంబంధిత ప్రయోజనాలను మరో మూడు నెలలపాటు పొడిగించారు. ఇందులో భాగంగా 100 మంది వరకు ఉద్యోగులు (90 శాతంమంది ఉద్యోగులకు రూ.15,000 కంటే తక్కువ వేతనం ఉండాలి) కలిగిన సంస్థలు, ఉద్యోగుల తరఫున కేంద్రమే పీఎఫ్‌ చెల్లిస్తుంది. 

పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్‌ ఊరట కల్పించారు. ఈ ఆర్థిక  సంవత్సరానికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు గడువును నవంబర్‌ 30 వరకు పొడిగించారు. అలాగే టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లను 25 శాతం తగ్గించారు. వేతనేతర చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. 

also read  రుణాలు 100 శాతం చెల్లిస్తా, కేసు క్లోజ్ చేయండి: విజయ్ మాల్యా

‘2020 మే 14 నుంచి 2021 మార్చి 31 వరకు ప్రస్తుతం ఉన్న టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లను 25 శాతం తగ్గిస్తున్నాం. కాంట్రాక్టులు, వడ్డీ, అద్దె, డివిడెండ్‌, కమిషన్‌ లేదా బ్రోకరేజీ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీని వల్ల ప్రజలకు రూ.50,000 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు.

ట్యాక్స్‌ ఆడిట్‌ గడువును అక్టోబర్‌ 31వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌ 30తో గడువు మీరనున్న మదింపు కాలాన్ని (అసెస్‌మెంట్స్‌) ఈ ఏడాది 31 వరకు, వచ్చే ఏడాది మార్చితో గడువు మీరనున్న మదింపు కాలాన్ని అదే ఏడాది సెప్టెంబర్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇంకా స్థిరాస్తి రంగానికి కొన్ని మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల నిర్మాణ రంగం కుప్పకూలి, ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయాయి. పూర్తయిన ప్రాజెక్టులు అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మహా ప్యాకేజీలో భాగంగా స్థిరాస్తి రంగానికీ ‘ఆర్థిక’ ఉద్దీపన లేకుండా కొన్ని ప్రత్యేక ఉపశమనాలు ప్రకటించారు.

మార్చి 25న లేదా ఆ తర్వాత పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల గడువు మరో ఆరు నెలల పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రెరా చట్టం కింద నమోదైన ప్రాజెక్టులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తి గడువు ఆచరణ సాధ్యం కానిదిగా పరిగణిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టుల పూర్తికి మరో మూడు నెలల సమయం ఇస్తామని తెలిపారు.