కరోనా కట్టడి నిమిత్తం భారతదేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉపాధి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల పరిస్ధితి దారుణంగా తయారైంది. దీంతో నగరాలు, పట్టణాల నుంచి కార్మికులు తమ స్వస్థలాలకు కాలినడకన ప్రయాణించడం కలచివేస్తోంది.

రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా వేల సంఖ్యలో కూలీలు కాలినడకన బయలుదేరుతున్నారు.

Also Read:కరోనా లాక్ డౌన్... నన్ను రక్షిస్తోంది ఇదే.. మోదీ వీడియో

దీనిపై దాఖలైన అత్యవసర వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్.ఐ బాబ్డే మాట్లాడుతూ.. 21 రోజుల పాటు కార్మికులు ఉన్న చోటే ఉండటానికి తగిన పరిస్థితులు, వనరులు లేవని వ్యాఖ్యానించారు.

భయం, ఆందోళన కరోనా వైరస్ కంటే భయంకరమైనవని ఆయన బొబ్డే వ్యాఖ్యానించారు. అదే సమయంలో పిటిషన్‌దారుల వాదనలపై స్పందిస్తూ.. ప్రభుత్వం  ఇప్పటికే వలస కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుందని అన్నారు.

అలాగే వలస కార్మికుల ప్రయాణాన్ని నిలిపివేసేందుకు, సంక్షేమానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మంగవారం తమకు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జస్టిస్ బొబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. కేంద్రం నుంచి ప్రస్తుత స్థితిపై నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తామని తెలిపింది.

Also Read:మందు బాబులకు గుడ్ న్యూస్ : ఆన్ లైన్ లో మద్యం విక్రయాలు.....

కేంద్ర  ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కార్మికుల వలసలను ఆపాల్సిన అవసరం ఉందని, దీనిని పరిష్కరించడానికి కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకున్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. కాగా వలస కార్మికులు వేలాది మంది రోడ్లపైకి రావడంతో వారిని సొంత రాష్ట్రాలకు తరలించడానికి ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. కాగా భారతదేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,071కు చేరుకుంది. వీరిలో 29 మంది మరణించగా, 100 మంది కోలుకున్నారు.