హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో మార్కెట్లు తెరుచుకున్నాయి. ముఖ్యంగా  ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్‌ మార్కెట్లలో సందడి నెలకొంది. 

దీంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ వస్తువులను ప్రజలు భారీగా కొనుగోళ్లు చేశారు. దీంతో ట్రూప్‌బజార్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెట్, రాంకోఠి, ఫీల్‌ఖానా, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల ఆటోమొబెల్‌ మార్కెట్లలో సందడి నెలకొంది. ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. దీంతో తొలి రోజు మార్కెట్‌ కళకళలాడింది. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. 

రాంకోఠి, ట్రూప్‌బజార్, కోఠి బ్యాంక్‌స్ట్రీట్, ఫీల్‌ఖానా మార్కెట్లకు ఎలక్ట్రానిక్స్, ద్విచక్ర, కార్ల స్పేర్‌పార్ట్స్‌తో పాటు హౌస్‌ వైరింగ్, ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్‌ స్వీచ్‌లు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం కనిపించింది.

అంతే గాక కొనుగోలుదారులు సొంత వాహనాల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పెద్ద ఎత్తున తీసుకెళ్తుండటంతో పలుచోట్ల చిన్న ప్రమాదాలు జరిగాయి. గూడ్స్‌ ఆటోల రవాణా లేకపోవడంతో కొందరు ప్యాసింజర్‌ ఆటోల్లో వస్తువులను తరలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎల్రక్టానిక్‌ దుకాణదారులు, ఆటో మొబైల్‌ దుకాణదారులు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారులకు సొంత మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకున్నారు. షాపుల్లో భౌతికదూరం పాటించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. 

also read కరోనా కష్టాలు: మెట్రోపాలిటన్స్‌లో రెంటల్ కార్స్‌తో తడిసిమోపెడు

షాపు లోపలకు కొద్ది మందిని మాత్రమే అనుమతినిస్తూ, వారు వెళ్లిపోయిన తర్వాతే ఇతరులకు అనుమతి ఇచ్చారు. ఇక మరోవైపు ఎల్రక్టానిక్, ఆటోమొబైల్‌ వ్యాపారులు సొంతంగా వైబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకుని ఈజీ బైయింగ్, ఈజీ సేల్‌ పద్ధతికి స్వీకారం చుట్టారు. 

రాష్ట్రంలోనే పేరొందిన మార్కెట్లు హైదరాబాద్ నగరంలో ఉండటంతో వివిధ జిల్లాల నుంచి కేవలం ఆన్‌లైన్‌ ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకొని టాన్స్‌పోర్టుల ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఆటోమొబైల్‌ వ్యాపారులకు తమ సంఘం ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశామని తెలంగాణ ఆటోమోబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. మాస్క్‌లు లేకపోతే వాహనాలు విక్రయించవద్దని వ్యాపారులకు సూచించామన్నారు. 

ప్రతి వినియోగదారుడినీ శానిటైజ్డ్‌ చేసిన తర్వాతే విక్రయిస్తున్నామని తెలంగాణ ఆటోమోబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌గుప్తా చెప్పారు. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, ఎక్కువ శాతం ఆన్‌లైన్‌ వ్యాపారానికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వ్యాపారాల నిర్వహణకు తమకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.      

30 ఏళ్ల నుంచి కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్‌ వ్యాపారం చేస్తున్నామని, లాక్‌డౌన్‌ వల్ల 50 రోజులకు పైగా తమ దుకాణాలు బంద్‌ ఉండటం ఇదే మొదటిసారి పలువురు వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి దుకాణాలు తెరిచామన్నారు. వేసవి వ్యాపారం ఇప్పుడే మొదలైందని తెలిపారు. ప్రజలకు కావాల్సిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, హౌస్‌ వైరింగ్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.