న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రిని బుధవారం నాడు మూసివేసింది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో ఈ ఆసుపత్రిని మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో ఈ ఆసుపత్రి భవనం ఓపీడీ, ల్యాబ్స్ మూసివేసినట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు వీటిని శానిటైజేషన్ చేయనున్నట్టుగా తెలిపారు. 

కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న డాక్టర్‌ను కలిసిన వారందరిని కూడ క్వారంటైన్ కు తరలించినట్టుగా అధికారులు ప్రకటించారు.యూకే నుండి వచ్చిన బంధువుల ద్వారా  ఈ డాక్టర్ కు కరోనా సోకిందని అధికారులు చెబుతున్నారు.

also read:కరోనా లాక్ డౌన్ లోనూ కార్మికుడి కష్టం.. డబ్బు, పూలతో వర్షం..

యూకే నుండి డాక్టర్ సోదరుడు అతని భార్య ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. డాక్టర్ సోదరుడి భార్య ఇటీవలనే వారి ఇంటికి వచ్చి వెళ్లిందని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలోనే మంగళవారం నాడు 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మొహల్లా క్లినిక్ లో పనిచేసిన డాక్టర్ దంపతులకు కూడ గతంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా నుండి వచ్చిన రోగికి వీరు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఈ రోగి నుండి ఈ దంపతులకు కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసులు 1397కు చేరుకొన్నాయి. వీటిలో 146 కొత్త కేసులు. కరోనా సోకిన వారిలో  35 మంది మృతి చెందినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ ప్రకటించింది.