న్యూఢిల్లీ: అసోం రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు నమోదైంది. రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాలపై మత పరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈ కేసు నమోదైంది.

క్వారంటైన్ కేంద్రాలపై విపక్షానికి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిటెన్షన్ కేంద్రాల కంటే క్వారంటైన్ సెంటర్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

అసోం రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాలు ప్రమాదకరంగా ఉన్నాయి.. అంతేకాదు డిటెన్షన్ కేంద్రాల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఇస్లాం మరో వ్యక్తితో మాట్లాడిన ఆడియో కలకలం సృష్టించింది. 

అసోంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే. మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచారన్నారు. 

క్వారంటైన్ లో ఉన్న వారిని క్వారంటైన్ లో ఉన్న సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు ఆరోగ్యంగా ఉన్న వారికి కూడ ఇంజెక్షన్లు ఇస్తూ కరోనా వైరస్ సోకిన రోగులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఒక వంతు కేసులు  ఢిల్లీ మర్కజ్ నుండి తిరిగి వచ్చిన వారి నుండి వచ్చినవేనని రికార్డులు చెబుతున్నాయి. అసోం రాష్ట్ర ప్రభుత్వం రెండు స్టేడియాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. 

Also read:లాక్ డౌన్: కేసీఆర్ బాటలోనే మరికొందరు సీఎంలు, మోడీ ఆలోచనపై ఉత్కంఠ

రెండు వేల బెడ్స్ తో క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసింది.  అదే విధంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడ కరోనా రోగులకు కూడ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వీలుగా ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చారు.

ఇస్లాం ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐడియూఎఫ్) కు చెందిన ఎమ్మెల్యే. దింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అసోంలో నగానా జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది.ఇస్లాం ను అసోం పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.