న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న  తరుణంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను మరిన్ని రోజుల పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా అధికారవర్గాలు ప్రకటించాయి.

దేశంలో 4421 మందికి కరోనా వైరస్  సోకింది.లాక్ డౌన్ ప్రస్తుతం మూడో వారంలోకి చేరింది. తాజాగా 354 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకిన 326 మంది కోలుకొన్నారని ప్రభుత్వం ప్రకటించింది.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కొనసాగించాలని  మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ డౌన్ ను కొనసాగించడమే మంచిదని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు  అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో కేసీఆర్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకొన్న విషయం తెలిసిందే.

కేసీఆర్ బాటలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ ఉన్నారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Also read:ఢిల్లీ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసిన 18 మందికి కరోనా

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్టుగా సమాచారం. యూపీతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు కూడ కేంద్రాన్ని కూడ కోరినట్టుగా సమాచారం.

ఈ విషయమై కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.