దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోవాలన్నదే మా ప్రధాన లక్ష్యం: ఆర్‌బిఐ గవర్నర్
భారతదేశ మూలాలు గట్టిగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా విపత్తుతో తలెత్తిన పరిస్థితులతో ఆర్థిక రంగం అస్తవ్యస్తమైందన్నారు. వివిధ రంగాలను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీలు అవసరం అని శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుత విపత్కర వేళ ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోవడం ఒకింత కష్టం అని పేర్కొన్నారు.
ముంబై: కరోనా మహమ్మారి ధాటికి దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు స్తంభించి పోయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడం ఒకింత కష్ట సాధ్యమేనని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
వైరస్ నిర్మూలన కోసం అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్.. దేశ ఆర్థిక స్వరూపాన్నే మార్చి వేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లోటు నగదీకరణపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
గత నెల 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ జీడీపీలో ద్రవ్యలోటును 3.5 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరదని శక్తికాంత దాస్ తెలిపారు. .
ఆర్బీఐ అనేది ఓ స్వయంప్రతిపత్తి కల సంస్థ అని, అన్ని నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకుంటుందని శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ప్రతీ నిర్ణయానికి ముందు తమ పరిధిలో తమ భాగస్వాములతో సంప్రదిస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే తమను కేంద్ర ప్రభుత్వం.. తాము కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై సంప్రదిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. గతంలో ప్రభుత్వంతో తాను పనిచేయడం సమతూకమైన నిర్ణయాలకు కలిసొస్తున్నదని చెప్పారు. ఇంతకుముందు ఆర్థిక శాఖలో పనిచేసినప్పుడూ చాలా విషయాల్లో సమతూకంగా వ్యవహరించానని పేర్కొన్నారు.
గతంలో అటు ప్రభుత్వాన్ని, ఇటు ఆర్బీఐని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నానని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నానని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఉద్దీపనలు అవసరం అని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే పనిలో ఉన్నదని తెలిపారు.
ఓవైపు కరోనా మహమ్మారి సృష్టిస్తున్న సవాళ్లను అధిగమిస్తూనే.. మరోవైపు ద్రవ్యలోటును పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందని భావిస్తున్నానని శక్తి కాంత దాస్ వెల్లడించారు. ప్రభుత్వపరంగా వ్యయ నియంత్రణ అవసరమని, ఇందుకు తగ్గట్లే ఉద్యోగులకు కరువు భత్యం వంటి వాటిని నిలిపేసిందన్నారు.
ఇదే సమయంలో లాక్‌డౌన్ దెబ్బకు కుదేలైన రంగాలను ఆదుకోవాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు ఇప్పటికే పేదలకు ఆహారోత్పత్తుల పంపిణీ, నగదు సాయం, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్‌ధన్ యోజన ఖాతాల్లో నగదు డిపాజిట్లు తదితర చర్యలను కేంద్రం చేస్తున్నదని, దేశ జీడీపీలో ఇవి 0.8 శాతానికి సమానం అని తెలిపారు.
టీఎల్‌టీఆర్‌వో 2.0 స్కీం అమలులో బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవచ్చని ముందే ఊహించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అదనపు ప్రోత్సాహకాలను ఇచ్చినప్పటికీ బ్యాంకులు టార్గేటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ (టీఎల్‌టీఆర్‌వో) 2.0కు ఆసక్తి చూపలేదన్నారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్బీఐ నుంచి తక్కువ రేటుకు నిధులను తీసుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న చిన్న కంపెనీలకు రుణాలివ్వడం సంస్థాగతంగా అంత శ్రేయస్కరం కాదని బ్యాంకర్లు భావించారని శక్తికాంత దాస్ చెప్పారు. అందుకే రూ.25,000 కోట్లకు రూ.12,850 కోట్లకు సరిపడానే 14 బిడ్లు దాఖలయ్యాయన్నారు
దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఇప్పుడు తమ ముందున్న ప్రధాన లక్ష్యం అని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నద్నారు. అనుకోని ఈ విపత్తుతో బడ్జెట్ లక్ష్యాలు దెబ్బతిన్నాయన్నారు.
కరోనాతో ఏర్పడిన బడ్జెట్ లోటును సరిచేయడానికి ప్రభుత్వ బాండ్లను కొనాలన్నదానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్బీఐ నగదు నిల్వలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆర్థికంగా ఆర్బీఐ అన్నివేళలా బలంగా ఉండటం కూడా ముఖ్యమేనని తెలిపారు.
also read జియోమార్ట్ సేవలు ప్రారంభం... వాట్సాప్ నంబరు ఉంటే చాలు..!
ప్రభుత్వ బాండ్ల కొనుగోలు విషయంలో ముందస్తు వ్యూహంతో రాజీ పడకుండా ప్రభుత్వానికి తమ వంతుగా సాయం చేస్తాం అని శక్తికాంతదాస్ తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యం అసాధ్యమేనన్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ రకమైన ఖర్చులు చేస్తుందన్న దానిపై, ఎలాంటి ఉద్దీపనలను ప్రకటిస్తుందన్న దానిపై ద్రవ్యలోటు నియంత్రణ ఆధార పడి ఉంటుందని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇక అన్ని రుణాలకు మారటోరియం వర్తిస్తుందన్నారు.
మారటోరియం అమలు విషయంలో అన్ని బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు స్పష్టమైన సంకేతాలను ఆర్బీఐ ఇప్పటికే ఇచ్చిందని శక్తికాంతదాస్ తెలిపారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ దృష్ట్యా చాలామంది ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయన్నారు.
కష్టాల్లో ఉన్న వారికి ఊరటనివ్వడానికే మూడు నెలల మారటోరియం అందుబాటులోకి తెచ్చాం అని శక్తికాంత దాస్ చెప్పారు. అయితే తమ కస్టమర్లకు ఈ మారటోరియం ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై ఆయా సంస్థలదే తుది నిర్ణయమని ప్రకటించామని తెలిపారు.
ద్రవ్య లభ్యత, మూలధనం, ఇతరత్రా ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించాం అని శక్తికాంత దాస్ చెప్పారు. దీంతో వ్యక్తిగత కస్టమర్లకు మారటోరియం ఇస్తున్నా.. ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం బ్యాంకులు ఇవ్వడం లేదన్నారు. కాబట్టి పరిస్థితులను సమీక్షించి తగు విధంగా చర్యలు తీసుకోవడం శ్రేయస్కరం అని శక్తికాంతదాస్ అభిప్రాయ పడ్డారు.
రేటింగ్ పెరిగిందా? తగ్గిందా? అన్నదానితో సంబంధం లేకుండా భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు/ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి ఆకర్షణీయంగా తరలి వస్తున్నాయన్నారు.
కాబట్టి రేటింగ్ ఏజెన్సీల రేటింగ్ గురించి ఆందోళన అక్కర్లేదని స్పష్టంగా తెలుస్తున్నదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్నారు.
విదేశీ మదుపరులు తమ పెట్టుబడులపై కేవలం రేటింగ్ ఏజెన్సీల మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అనేక వాటిని అనుసరించి ఓ నిర్ధారణకు వస్తున్నారని, అయితే రేటింగ్ ఏజెన్సీలన్నీ అసంబద్ధమని చెప్పడం తన ఉద్దేశం కాదన్నారు.
విదేశాలతో పోల్చితే భారతీయ కరెన్సీ చాలా బలంగా ఉన్నదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాల మారకం కంటే రూపాయి విలువ ఆశాజనకంగా కదలాడుతున్నదన్నారు.
ప్రస్తుతం చాలా దేశాల కరెన్సీలు తీవ్రంగా తమ విలువను కోల్పోయాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గుర్తు చేశారు. అయినా గత 45 రోజులుగా పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం అని చెప్పారు.
నిజానికి భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఏదిఏమైనా ఆర్బీఐ వద్ద సరిపడా ఫారెక్స్ రిజర్వ్‌లున్నాయని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలం అని తెలిపారు.