మున్ముందు ఐటీకి కష్టకాలమే! అమెరికాలో కళ తప్పిన సిలీకాన్ వ్యాలీ..

వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల తలరాతలను మార్చే ఐటీ రంగంపై కరోనా ప్రభావాలు తీవ్రంగా ఉండనున్నది. వ్యాపారాలు కోలుకునేందుకు సమయం పట్టేస్తుందని  ఐటీ నిపుణులు మహాలింగం హెచ్చరించారు. 
 
Challenging Time For IT Industry Said Mahalingam
వాషింగ్టన్/ముంబై‌: కరోనా ధాటికి అమెరికాలో భారత ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తల వేదిక సిలికాన్‌ వ్యాలీ కళ తప్పింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి టెక్నాలజీ దిగ్గజాలు మినహా చిన్న, మధ్య స్థాయి స్టార్టప్‌లకు కరోనా సెగ గట్టిగానే తగిలిందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌, ఐటీ పారిశ్రామికవేత్త ఎం రంగస్వామి తెలిపారు. 

దాంతో ఈ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు లేదంటే వేతనాల్లో కోతలకు సిద్ధమవుతున్నాయన్నారు. కొన్ని కంపెనీలైతే రెండింటినీ అమలు చేస్తున్నాయని ఐటీ పారిశ్రామికవేత్త ఎం రంగస్వామి అన్నారు. 

వచ్చే నెల నుంచి వ్యాలీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండవచ్చు. 5-10 శాతం వరకు  ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. 2000 నుంచి ఇప్పటివరకు సిలికాన్‌ వ్యాలీలో ఇలాంటి ప్రతికూలతను చూడలేదు. 2008లోనూ ఈ స్థాయి గడ్డు పరిస్థితులు ఎదురుకాలేదు. 

వచ్చే 18-24 నెలల వరకు తమ వద్ద కంపెనీ నిర్వహణకు సరిపడా నిల్వలు ఉండేలా సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే, నిధుల సేకరణకు ఇది అనువైన కాలం కాదు. ఒకవేళ ఫండింగ్‌ కోసం ప్రయత్నించినా, ఇన్వెస్టర్లు ఈ సమయంలో కంపెనీ మార్కెట్‌ విలువను మరీ తక్కువగా లెక్కగట్టే అవకాశాలున్నాయి.

హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న భారత టెకీల ఉద్యోగాలకు అంతగా ముప్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే, కంపెనీలకు వారే చౌకగా లభించే మానవ వనరు. ఐటీ కంపెనీల ప్రధాన వ్యయం ఉద్యోగుల జీతాలే. దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం పేర్కొన్నారు. 

also read ఈ ఏడాది భారత వృద్ధి రేటును తేల్చేసిన ఐఎంఎఫ్...కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణం...

ఆసియా సంక్షోభం, వై2కే, 2008 ఆర్థిక మాంద్యం లాంటి వాటిని కూడా దేశీ ఐటీ కంపెనీలు గట్టెక్కాయని .. కానీ ప్రస్తుత కరోనా వైరస్‌ మహమ్మారి వీటన్నింటి కన్నా భిన్నంగా ఉందని ఐటీ పారిశ్రామికవేత్త ఎం రంగస్వామి చెప్పారు.

‘నేను 1970లో ఐటీ రంగంలో అడుగుపెట్టాను. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల పునరుద్ధరణకు చాలా సమయం పట్టేస్తుంది. వలస నిబంధనలు మొదలుకుని చాలా అంశాలు పెను మార్పులకు లోనవుతాయి‘ అని మహాలింగం వివరించారు. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)లో మహాలింగం గతంలో సీఎఫ్‌ఓగా, ఈడీగా వ్యవహరించారు. 

అంతర్జాతీయ స్థాయిలో చూస్తే భారత కంపెనీలు విశ్వసనీయ భాగస్వాములని ఈ సంక్షోభంతో నిరూపితమైందని ఐటీ పారిశ్రామికవేత్త ఎం రంగస్వామి చెప్పారు. లాక్‌డౌన్‌ వేళ కూడా సర్వీసుల డెలివరీలో సమస్యలు తలెత్తకుండా దేశీ ఐటీ కంపెనీలు వినూత్నమైన పరిష్కార మార్గాలు అమలు చేస్తున్నాయని ఆయన కితాబిచ్చారు. 

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక.. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణ తీరును పునఃసమీక్షించుకోగలవని.. తద్వారా ఐటీ సంస్థలకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు లభించగలవని మహాలింగం తెలిపారు. నిర్మాణ, తయారీ రంగ కంపెనీల్లో ఐటీ మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios