న్యూఢిల్లీ: కరోనా సోకిన వ్యక్తి 111 మందిని కలిశాడు. అతను ఈ వైరస్ వ్యాప్తిలో సైలెంట్ క్యారియర్ మారాడని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తొలుత అతనికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించలేదు. కానీ, ఆ తర్వాత ఆ వ్యాధి సోకినట్టుగా నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా మెలిగిన వారి శాంపిల్స్ ను కూడ వైద్యులు ల్యాబ్ కు పంపారు.

గువాహటికి చెందిన ఓ వ్యాపార వేత్త ఫిబ్రవరి 29వ తేదీన ఢిల్లీ నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన ఆసుపత్రికి వెళ్లాడు. శాంపిల్స్ పరిశీలించిన వైద్యులు అతడికి కరోనా సోకిందని నిర్ధారించారు. 

also read:కరోనా ఎఫెక్ట్: స్వీయ నిర్భంధంలోకి సీఆర్‌పీఎఫ్ డీజీ

అతను ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తే అతడికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించలేదు. ఢిల్లీ నుండి అతను వచ్చిన నెల రోజుల తర్వాత జలుబు, దగ్గుతో ఆయన బాధపడ్డాడు. ఆ సమయంలో ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్ తిన్నారు. ఆ సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలింది.

అయితే ఈ వ్యాపారి అప్పటికే 111 మందితో సన్నిహితంగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అతను సైలెంట్ క్యారియర్ గా మారాడని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అతనితో సంబంధాలు కలిగి ఉన్న వారి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు.  ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత అతను షిల్లాంగ్, నాగౌన్ కు కూడ వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.