కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 18వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో నాలుగు లక్షల మంది ఈ వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే.. దీనిని చాలా మంది ప్రజలు పాటించడం లేదు. కరోనా ప్రమాదాన్ని గుర్తించకుండా.. బయట తిరగాలని ఉత్సాహపడుతున్నారు.

Also Read దేశంలో 722కు చేరిన కరోనా కేసులు: 16 మంది మృతి, రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ.....

ఈ క్రమంలో... దీనిపై అవగాహన కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. కూరగాయల మార్కెట్లో ఓ ఇటుకరాయి తీసుకొని, స్వయంగా సామాజిక దూరం పాటించేలా కొలతలతో సర్కిల్‌ గీసి ప్రజలకు అవగాహన కల్పించారు.

కరోనా నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు మ‌మ‌తా గురువారం కోల్‌క‌తా వీధుల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె అధికారుల‌తో క‌లిసి కోల్‌ క‌తాలోని ఒక కూరగాయ‌ల మార్కెట్ కు చేరుకున్నారు. అక్క‌డ కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ వ్యాపారులకు, ప్రజలకు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా సామాజిక దూరం ఎలా పాటించాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంతరం స్వయంగా ఇటుక రాయితో వృత్తాలను గీసి దానిలో మాత్రమే నిలబడాలని సూచించారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్  పోస్టు చేశారు.  అంతేకాకుండా  మాటలు లేవు( నో వర్డ్స్)  అంటూ ఈ వీడియో కి క్యాప్షన్ ఇచ్చారు.   కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు.