వచ్చే ఏడాది నుంచి ఇచ్చిన మాటకు కట్టుబడి పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్ కార్ల తయారీకి మాత్రమే పరిమితమైంది వోల్వో కార్స్.స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో వినియోగదారులకు తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఎక్స్ సీ-40 రీచార్జ్’ను త్వరలో మార్కెట్లోకి తీసుకు రానున్నది.

అందుకు అనుగుణంగా వచ్చేడాది నుంచి ఎక్స్ సీ 40 రీచార్జీ పేరుతో కొత్త తొలి విద్యుత్ కారును విపణిలోకి పరిచయం చేయనున్నది. కంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్ ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఎక్స్‌సీ -40 రీచార్జ్ కారు... ఎక్స్ సీ ఎస్-40 ఎస్‌యూవీ డీజిల్ ఇంజిన్ మోడల్ కారులా ఉంటుంది. 

ఈ కారులో 150kw (కిలోవాట్) ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. 78కేడబ్ల్యూహెచ్ లీథియం ఆయాన్ బ్యాటరీతో విపణిలో అడుగు పెట్టనున్న ఈ కారు 402 హెచ్పీ శక్తిని, 659 న్యూటన్ మీటర్ టార్క్  ను విడుదల చేస్తున్నది. కేవలం 4.9 క్షణాళ్లో వంద కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ధర 48 వేల డాలర్లు  (సుమారు 36 లక్షలు ) ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఒక్కసారి చార్జింగ్ పూర్తి చేసుకుంటే 400 కి.మీ. అలవోకగా ప్రయాణిస్తుందని వోల్వో తెలిపింది. ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్‌తో కేవలం 40 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ చార్జీ అవుతుంది. తొలిసారిగా ఇందులో గూగుల్ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అమర్చారు. 

 

ఈ కారులో ఉన్న వోల్వో ఆన్ కాల్ సర్వీసు ద్వారా డ్రైవర్లు కారు నడపడానికి ఎంత విద్యుత్ వాడుతున్నారో తెలుసుకోవచ్చు. వచ్చే ఏడాది అమెరికా, యూరప్ మార్కెట్లలో ఈ కారును విడుదల చేస్తామని వోల్వో ప్రకటించింది. 

2019 నుంచే కర్బన ఉద్గారాలను వెలువరించే డీజిల్, పెట్రోల్ వేరియంట్ ఇంజన్లతో నడిచే మోడల్ కార్లను తయారు చేయడం నిలిపివేస్తామని వోల్వో పేర్కొంది. అందులో భాగంగానే తొలి విద్యుత్ కారును విపణిలోకి తేనున్నది. 

2025 నాటికి పది లక్షల విద్యుత్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే వోల్వో హైబ్రీడ్ కార్ల విక్రయాలను మొదలు పెట్టింది వోల్వో. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒక విద్యుత్ కారును విడుదల చేస్తామని ప్రకటించింది.