కరోనా కష్టకాలంలో రెనాల్ట్ ఉద్యోగులకు వరాలు, ప్రమోషన్లు..
కరోనా కష్టకాలంలోనూ తన ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు ప్రకటించింది. వచ్చే ఆగస్టు నుంచి అమలులోకి వచ్చేలా సిబ్బంది వేతనాల్లో 15 శాతం పెంచడంతోపాటు ప్రమోషన్లు కల్పించింది. ఇక తమ డీలర్లను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది.
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో వివిధ రంగాల సంస్థలు తమ ఆదాయాలను కోల్పోయాయి. దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు పలు సంస్థలు ఉద్యోగాల కోత విధించడంతోపాటు వేతనాలు తగ్గించి వేయడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఈ తరుణంలో ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు అండగా నిలవాలని భావించింది.
సిబ్బందికి వేతనాలు పెంపు, పదోన్నతులు ప్రకటించి రెనాల్ట్ ఇండియా ప్రత్యేకంగా నిలిచింది. తన సిబ్బంది మనోస్థైర్యాన్ని పెంచడం కీలకమని, అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని రెనాల్ట్ ఇండియా తెలిపింది.
2020 ఆర్థిక సంవత్సరంలో రెనాల్డ్ ఇండియా సిబ్బంది వేతనాల్లో 10-12 శాతం పెంపుతో పోలిస్తే ఈ పెంపు ఎక్కువగా ఉండటం మరో విశేషం.
also read లాక్‌డౌన్‌తో లక్షల వాహనాల ఉత్పత్తి నిలిపివేత: మహీంద్రా ఆందోళన
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కరోనా, లాక్ డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపీఎల్) తన ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును అమలు చేయనుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి పదోన్నతులు కూడా ఇస్తోంది.
వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా 250 మంది ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును ప్రకటించింది. అలాగే 30 మందికి పైగా అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు తన డీలర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కార్లు, విడిభాగాలపై లాభాలను 200-300 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.