లాక్‌డౌన్‌తో లక్షల వాహనాల ఉత్పత్తి నిలిపివేత: మహీంద్రా ఆందోళన
కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల తాము 1.17 లక్షల వాహనాల ఉత్పత్తిని కోల్పోయామని దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. అయితే, ఈ దఫా వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లతోపాటు గ్రామాల్లో ఇతర వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీః కరోనా విశ్వమారిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తాము 87 వేల వాహనాల ఉత్పత్తిని కోల్పోయామని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. వ్యవసాయ రంగ కార్యకలాపాల్లో వినియోగించే ట్రాక్టర్ల తయారీలో 30 వేలు కోల్పోయామని వ్యాఖ్యానించింది.
మార్చి 25న లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటి నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా తన కార్యకలాపాలన్నీ నిలిపివేసింది. ఫలితంగా మార్చి నెలలోనే 23,400 వాహనాలు, 14,700 ట్రాక్టర్ల ఉత్పత్తిని కోల్పోయామన్నది.
ఉత్పత్తి పరిమాణం తగ్గడం వల్ల కంపెనీ ఆదాయం, లాభాలపై పడుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో స్థిర, చర వ్యయాలను తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకుంటామని మహీంద్రా అండ్ మహీంద్రా వివరించింది. తద్వారా లాక్ డౌన్ దుష్ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.
ట్రాక్టర్ల విక్రయాల్లో మంచి పురోగతి ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా అంచనా వేస్తున్నది. రబీ పంట దిగుబడులు భారీగా ఉండటంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ధాన్య సేకరణ చేపట్టడం, పలు పంటలకు కనీస మద్దతు ధర పెంచడం, సాధారణ వర్షపాతం నేపథ్యంలో ట్రాక్టర్ల డిమాండ్ పెరగుతుందని అంచనా వేశామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.
గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఇతర వాహనాల విక్రయాలు ఆలస్యంగా పుంజుకుంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తున్నది. ఇప్పటికే 75 శాతం మంది డీలర్లు తమ కార్యకలాపాలను పున:ప్రారంభించారని తెలిపింది.
లాక్ డౌన్ 5.0లో ఇచ్చిన మినహాయింపులతోనే త్వరలోనే వాహనాల ఉత్పత్తి వేగవంతం కాగలదని ఆశాభావంతో ఉంది. స్వల్పకాలంలో సమస్యలు ఎదురైనప్పటికీ, కంపెనీ లిక్విడిటీ సామర్థ్యం బలంగా ఉన్నందున అన్ని రకాల రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
also read గూగుల్ కొరడా.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తొలగింపు..
ఇదిలా ఉంటే కరోనా విశ్వమారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కేవలం ఆర్థిక వినాశనంతోనే ఆగదని, మరో వైద్య సంక్షోభం కూడా సంభవిస్తుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని గుర్తు చేశారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రానికి అంత సులభం కాదని ఆయన అంగీకరించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ పొడిగింపుతో ప్రయోజనమేమీ ఉండదని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ‘ఇంతకుముందు నేను ట్వీట్ చేసినట్లు లాక్‌డౌన్ పొడిగింపులు కేవలం ఆర్థికపరమైన నష్టాలకే పరిమితం కావు. మరో వైద్య సంక్షోభాన్నీ సృష్టిస్తాయి’ అని ఆనంద్ మహీంద్రా ఇటీవల ట్వీట్ చేశారు.
‘రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇక ఆస్పత్రులను, అందులోని పడకలను పెంచడంపై దృష్టి పెట్టాలి. ఆక్సిజన్ వసతులనూ పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలి’ అని ఆనంద్ మహీంద్రా అన్నారు.
పరిమిత వనరుల్లో దవాఖానల్లో పడకల పెంపు విషయంలోనూ భారత సైన్యానికి మంచి అనుభవం ఉన్నదని ఆనంద్ మహీంద్రా సూచించారు. 49 రోజుల లాక్ డౌన్ సరిపోతుందని ఇంతకుముందు ఆనంద్ మహీంద్రా అభిప్రాయ పడ్డారు. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూనే ఉన్నారు. అత్యంత చౌక ధరకు వెంటిలేటర్లను తయారు చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధ పడింది. మరోవైపు కరోనా రోగులకు చికిత్సనందించేందుకు వైద్య సిబ్బందికి అవసరమైన ఫేస్ షీల్డ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.