మారుతి సంచలన నిర్ణయం: డీజిల్ కార్ల అమ్మకాల నిలిపివేత
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) గురువారం సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి దేశంలో డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) గురువారం సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి దేశంలో డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మారుతి ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1, 2020 నుంచి కంపెనీ డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భారీ డిమాండ్ లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 1500సీసీ మించిన కార్ల విక్రయాలపై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
బాలెనో కార్లు డీజిల్ వర్షన్ మాత్రం కొనసాగే అవకాశం ఉంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి నిర్ణయంతీ సుకుంటామని ఆయన తెలిపారు. కాగా, బీఎస్ VI వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలకు గడువును మార్చి 31, 2020గా ప్రభుత్వం నిర్ణయించింది.
బీఎస్ VI నిబంధనలు అమల్లోకి వస్తే 1500సీసీ కంటే తక్కువ డీజిల్ ఇంజిన్లు కలిగిన మారుతి వాహనాలను తయారు చేయడంలో ప్రయోజనం లేదని భావిస్తున్నట్లు భార్గవ తెలిపారు. గడువులోగా బీఎస్ VI వాహనాల ఉత్పత్తిని పూర్తి చేస్తామని చెప్పారు.
మొత్తం 16 మోడల్స్ అప్‌గ్రేడ్ చేస్తామని వివరించారు. ఎన్నికలు, ఇంధన ధరలు, ఇరాన్ సమస్య మొదలైనవి అనిశ్చితికి కారణంగా మారాయని తెలిపారు. వివిధ దేశాల నియమ నిబంధనలను బట్టి ఆయా దేశాల్లో ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.